బెంగుళూరు: 19 ఏళ్ల అస్సాం అమ్మాయి మాయా గగోయ్.. బెంగుళూరులోని సర్వీస్ అపార్ట్మెంట్లో హత్యకు(Bengaluru Murder) గురైంది. శనివారం ఆమె తన బాయ్‌ఫ్రెండ్‌తో ఆ రూమ్‌లోకి వెళ్లింది. కానీ మూడు రోజుల తర్వాత ఆ రూమ్ నుంచి ఆమె మృతదేహాన్ని వెలికితీశారు పోలీసులు. రూమ్‌ను బుక్ చేసుకోవడానికి ముందే, ఆమె బాయ్‌ఫ్రెండ్ హత్యకు ప్లాన్ చేసి ఉంటారని పోలీసులు అంచనా వేస్తున్నారు. ఆ ప్రధాన నిందితుడి కోసం గాలిస్తున్నారు. కుళ్లిన మాయా గగోయ్ మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. ఆరవ్ హర్ని ఆ రూమ్‌ను బుక్ చేశాడు. నవంబర్ 23వ తేదీన మధ్యాహ్నం 12.30 నిమిషాలకు అపార్ట్మెంట్లోకి ఎంటరైనట్లు సీసీటీవీ ఫూటేజ్ ఆధారంగా తెలిసింది. ఆ తర్వాత మంగళవారం ఉదయం 8.30 నిమిషాలకు హర్ని రూమ్ నుంచి ఒక్కడే వెళ్లిపోయాడు.
పోలీసుల కథనం ప్రకారం.. మాయా గగోయ్ని సోమవారం హర్నీ కత్తితో పొడిచి చంపాడు. ఇందిరానగర్ ఏరియాలో ఉన్న రెంట్ అపార్ట్మెంట్లో ఈ ఘటన జరిగింది. మాయాను హత్య చేసిన తర్వాత ఓ రోజు ఆమె శరీరంతోనే హర్ని ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. దుప్పట్లు, మెత్తలపై రక్తం మరకలు ఉన్నట్లు తెలిసింది. పసుపు రంగు నైలాన్ తాడును కూడా రూమ్‌లో గుర్తించారు. రూమ్‌లో దొరికిన డాకుమెంట్ల ఆధారంగా ఆమె పేరును మాయా గగోయ్ అని తెలుసుకున్నారు. ఆమె వయసు 19 ఏళ్లు. ఆమె శరీరంపై చాలా గాయాలు ఉన్నట్లు గుర్తించారు. ఆమె ఛాతిపై పొడిచిన గాయం కూడా ఉన్నది. తలపై కూడా గాయాలు ఉన్నట్లు డీసీపీ దేవరాజ్ తెలిపారు.
అనుమానిత వ్యక్తి కేరళకు చెందినట్లు తెలుస్తోంది. అపార్ట్మెంట్ నుంచి వెళ్లిన తర్వాత అతను తన మొబైల్ ఫోన్‌ను స్విచాఫ్ చేశాడు. నవంబర్ 23 నుంచి 26 వరకు సర్వీసు అపార్ట్మెంట్లోకి ఎవరూ వెళ్లినట్లు ఆధారాలు లేవు. తనతో పాటు కత్తి తెచ్చుకున్న నిందితుడు.. రూమ్‌కు వచ్చాక నైలాన్ రోప్‌ను ఆర్డర్ చేశాడు. చెడు వాసన వస్తున్నట్లు పోలీసులకు ఫోన్ కాల్ వచ్చిన తర్వాత ఆ రూమ్‌కు పోలీసులు వెళ్లారు. డాగ్ స్క్వాడ్, ఫోరెన్సిక్ నిపుణులు రంగంలోకి దిగారు. హెచ్ఎస్ఆర్ లేఅవుట్లో ఉన్న ఓ ప్రైవేటు సంస్థలో మాయా గగోయ్ కౌన్సిలర్‌గా చేస్తోంది. పోలీసులు మర్డర్ కేసు నమోదు చేశారు. మాయా గగోయ్ సోదరి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా అనుమానితుల కోసం గాలిస్తున్నారు.