అహ్మదాబాద్: గుజరాత్(Gujarat)లో పరువు హత్య జరిగింది. 18 ఏళ్ల అమ్మాయి మృతి పట్ల అనుమానాలు వ్యక్తం అయ్యాయి. దీంతో ఆ కేసును దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. ఆ మర్డర్ కేసులో తండ్రే హంతకుడు అని తేల్చారు. బనస్కాంత జిల్లాలో ఈ ఘటన జరిగింది. పోలీసులు వెల్లడించిన వివరాలు ఇలా ఉన్నాయి.. చంద్రికా చౌదరీ అనే 18 ఏళ్ల అమ్మాయి నుంచి ఆమె ప్రియుడు హరీశ్ చౌదరీ ఫోన్‌కు ఓ మెసేజ్ వచ్చింది. తనను కాపాడాలి అంటూ ఆ మెసేజ్‌లో ఉంది. కానీ ఆ రోజు రాత్రే చంద్రిక ప్రాణాలు విడిచింది. ఆమె సహజ కారణాల వల్ల మరణించినట్లు భావించారు. ఇంట్లో వాళ్లు ఎవరికీ తెలియకుండానే అంత్యక్రియలు నిర్వహించారు. కనీసం ఆమె సోదరుడికి కూడా చంద్రిక విషయాన్ని చెప్పలేదు.
కానీ ఆమె ప్రియుడు హరీశ్ చౌదరీకి అనుమానం రావడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. చంద్రిక పంపిన మెసేజ్‌లను పోలీసులకు ఫార్వర్డ్ చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు కేసును చేధించారు. తండ్రి సేధాబాయ్ పటేల్, చిన్నాన శివభాయ్ పటేల్ ఆ హత్య చేసినట్లు తేలింది. తారడ్లోని థాంటియాలో ఈ మర్డర్ జరిగింది. ఈ కేసులో ఇదర్ని అరెస్టు చేశారు. తండ్రి పరారీలో ఉన్నట్లు ఏసీపీ సుమన్ నాలా తెలిపారు.
హరీశ్, చంద్రిక.. కొన్నాళ్ల నుంచి రిలేషన్లో ఉన్నారు. కానీ ఆమె కుటుంబం హరీశ్‌ను వ్యతిరేకించింది. చంద్రికను మరొకరి ఇచ్చి పెళ్లి చేయాలని భావించింది. ఈ విషయాన్ని హరీశ్‌కు ఆ అమ్మాయి పలుమార్లు చెప్పింది. తన ఫ్యామిలీ నుంచి దూరంగా తీసుకువెళ్లాలని జూన్ 24వ తేదీన ఆమె హరీశ్‌ను వేడుకున్నది. ఒకవేళ నువ్వు తీసుకెళ్లకుంటే, తన ఇష్టానికి వ్యతిరేకంగా పెళ్లి చేస్తారని చెప్పిందామె. వాస్తవానికి అంతకుముందు ఇద్దరూ కుటుంబానికి దూరంగా వెళ్లిపోయారు. కానీ పోలీసులు వాళ్లను పట్టుకుని వచ్చారు. చంద్రికను ఇంటికి పంపారు. అయితే మళ్లీ కొన్ని రోజుల్లోనే పరిస్థితి విషమించింది. పేరెంట్స్ చంపేస్తారని హరీశ్‌కు మెసేజ్ వచ్చింది. ఆ తర్వాత ఆమె మృతిచెందింది.
చంద్రిక ప్రాణాలకు ముప్పు ఉందని తెలిసిన హరీశ్ .. హెబియస్ కార్పస్ పిటీషన్ వేశాడు. కానీ ఈలోగా ఆమె ప్రాణాలు కోల్పోయింది. సహజ మరణం చెందినట్లు ఆమె కుటుంబం డెత్ సర్టిఫికేట్ సమర్పించింది. కానీ హరీశ్ దీన్ని నమ్మలేదు. చంద్రిక మరణం కేసులో దర్యాప్తు చేపట్టాలని పోలీసుల్ని కోరాడు. విచారణ సమయంలో పోలీసులకు కొన్ని అనుమానాలు వచ్చాయి. సహజ మరణమే అయినా ఆమెను డాక్టర్ వద్దకు తీసుకెళ్లలేదని, కనీసం బంధువులకు చెప్పలేదని, సోదరుడికి కూడా ఆ విషయం తెలియలేదని గుర్తించారు. దీంతో కుటుంబంపై అనుమానాలు బలపడ్డాయి.
చంద్రిక మృతిపై డౌట్స్ రాకుండా ఉండేందుకు.. తొలుత ఆమెకు మత్తు మందు ఇచ్చారు. ఆ తర్వాత ఆమె గొంతు నొక్కారు. ఆ తర్వాత ఉరి వేసుకున్నట్లు చిత్రీకరించారని పోలీసులు తెలిపారు. సూసైడ్ చేసుకున్నట్లుగా నమ్మించి ఆ తర్వాత సహజంగా మరణించినట్లు చెప్పారని పోలీసులు పేర్కొన్నారు.