న్యూఢిల్లీ: పెట్రోల్, డీజిల్ ధరలను కేంద్రం లీటరుకు మూడు రూపాయల చొప్పున పెంచినందుకు నిరసనగా శనివారం దేశవ్యాప్తంగా ఐదు గంటలపాటు సమ్మె చేపట్టేందుకు గిగ్ అండ్ ప్లాట్ఫామ్ సర్వీస్ వర్కర్స్ యూనియన్(జీఐపీఎస్డబ్ల్యూయూ) పిలుపునిచ్చింది. దీనిలో యాప్ ఆధారిత క్యాబ్, డెలివరీ కార్మికులు పాల్గొనాలని కోరింది. ఈ సమ్మె మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కొనసాగింది.
సమ్మె ప్రభావం దేశ వ్యాప్తంగా డెలివరీ సేవలపై ప్రభావం చూపించింది. పశ్చిమాసియాలో అస్థిరత, ఇరాన్లో పెరుగుతున్న ఉద్రిక్తతలు, హొర్ముజ్లో అంతరాయాల మధ్య అంతర్జాతీయంగా ముడి చములు ధరలు పెరగడమే ఈ పెంపునకు కారణంగా నిలిచింది. ఇంధన ధరల పెంపు డెలివరీ కార్మికులపై మరింత ఆర్థిక భారాన్ని మోపుతున్నదని, ఈ అదనపు ఖర్చులను భరించే పరిస్థితిలో వారు లేరని జీఐపీఎస్డబ్ల్యూయూ అధ్యక్షురాలు సీమా సింగ్ పేర్కొన్నారు.
ప్రస్తుతం కొనసాగుతున్న వడగాడ్పుల పరిస్థితుల్లో స్విగ్గీ, జొమాటో, బ్లింకిట్ తదితర కంపెనీలకు చెందిన డెలివరీ కార్మికులు పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరల భారాన్ని ఏమాత్రం భరించలేరని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. యూనియన్ జాతీయ సమన్వయ కర్త నిర్మల్ గోరానా మాట్లాడుతూ అసంఘటిత రంగంలో ఉన్న లక్షలాది డెలివరీ కార్మికులు తమ జీవనోపాధి కోసం మోటార్ సైకిళ్లు, స్కూటర్లు, ఇతర వాహనాలపైనే ఆధారపడుతున్నారని వివరించారు.