న్యూఢిల్లీ: ఢిల్లీలోని ఓ శివారు ప్రాంతంలో ఉంటున్న ప్రముఖ గిటార్ ఆర్టిస్ట్ చోంగ్తమ్ విక్రమ్ సింగ్(Guitarist Vikram Singh)పై .. తాగుబోతులు అటాక్ చేశారు. తన ఇంటి ముందు వీరంగం చేస్తున్న వారిని వెళ్లిపోవాలంటూ విక్రమ్ ఆదేశించాడు. దీంతో తాగిన మైకంలో ఉన్న 8 మంది అతనిపై దాడి చేశారు. ఆదివారం రాత్రి ఈ ఘటన జరిగింది. విచక్షణారహితంగా చితకబాదడంతో అతన్ని ఆస్పత్రిలో చేర్పించారు. సోమవారం ఆ గిటారిస్ట్ ప్రాణాలు కోల్పోయాడు. ఆదివారం రాత్రి 11 గంటలకు నిందిత వ్యక్తులు చంగోతమ్ ఇంటి ముందు హంగామా చేశారు. అయితే వారిని అడ్డుకునేందుకు వెళ్లిన విక్రమ్‌పై ఆ తాగుబోతులు విరుచుకుపడ్డారు. ఆ దాడిలో 55 ఏళ్ల బాధితుడు తీవ్రంగా గాయపడ్డారు. 20 ఏళ్ల అతని కుమారుడు వెంటనే తండ్రిని సమీపంలోని హోలీ ఫ్యామిలీ ఆస్పత్రికి తీసుకెళ్లాడు. బీపీ మరీ పడిపోవడంతో అతనికి సర్జరీ చేయడం ఇబ్బందిగా మారింది.
ఇంపాల్‌కు చెందిన విక్రమ్ సింగ్.. ఢిల్లీలో ఓ మ్యూజిక్ స్కూల్‌ను ఆపరేట్ చేస్తున్నాడు. ఇంట్లో, ఢిల్లీ స్కూల్ ఆఫ్ మ్యూజిక్‌లోనూ విద్యార్థులకు శిక్షణ ఇచ్చాడతను. రాక్స్ అండ్ రూట్స్ ప్రాజెక్టులో అతను చేశాడు. రాజస్థానీ జానపద గాయకుడు మామే ఖాన్‌తో కలిసి ఆల్బమ చేశారు. అనేక సాంస్కృతిక కార్యక్రమాలు, కచేరీలను ఆయన నిర్వహించాడు. ఫేమస్ మణిపురి డైరెక్టర్ లక్ష్మీప్రియా దేవికి విక్రమ్ బంధువు అవుతారు. ఆయన భార్య 54 ఏళ్ల జ్యోత్న్సా ఓ ఎంఎన్సీలో సీనియర్ కన్సల్టెంట్‌గా చేస్తున్నారు. విక్రమ్ తల్లి చోంగ్తమ్ ఓంగ్బీ కమలాదేవీ. ఆమె పేరుగాంచిన మణిపురి క్లాసికల్, మాడ్రన్ సింగర్.