Jayam Ravi | కోలీవుడ్ స్టార్ హీరో రవి మోహన్ వ్యక్తిగత జీవితం మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. భార్య ఆర్తితో విడాకుల వ్యవహారం మొదలైనప్పటి నుంచి రవి మోహన్ పేరు తరచూ వార్తల్లో నిలుస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా గాయని, గోవాకు చెందిన కేనిషా ఫ్రాన్సిస్‌తో ఆయనకు ఉన్న సాన్నిహిత్యంపై ఆర్తి చేసిన ఆరోపణలు అప్పట్లో తీవ్ర చర్చకు దారితీశాయి. తాజాగా రవి మోహన్, కేనిషా కలిసి ఉన్నట్లు కనిపిస్తున్న ఓ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈ వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. రవి మోహన్, ఆర్తి దంపతులు విడాకులు తీసుకునే దిశగా వెళ్లిన సమయంలో వారి వ్యక్తిగత జీవితం గురించి పలు రకాల వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. తన వైవాహిక బంధం దెబ్బతినడానికి, విడాకుల నిర్ణయానికి రవి మోహన్‌కు కేనిషా ఫ్రాన్సిస్‌తో ఉన్న సాన్నిహిత్యమే కారణమని ఆర్తి ఆరోపించినట్లు వార్తలు వచ్చాయి.
గోవాతో పాటు కొన్ని ప్రైవేట్ కార్యక్రమాల్లో రవి, కేనిషా కలిసి కనిపించారని ప్రచారం జరగడంతో అప్పట్లో కేనిషా పేరు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయింది. ఈ వ్యవహారంపై ఇరువైపుల నుంచి వచ్చిన వ్యాఖ్యలు వివాదాన్ని మరింత పెంచాయి. విడాకుల వివాదం తీవ్ర స్థాయికి చేరుకున్న సమయంలో ఓ ప్రెస్మీట్లో రవి మోహన్ భావోద్వేగానికి గురై కంటతడి పెట్టడం కూడా అప్పట్లో చర్చనీయాంశమైంది. ఆర్తి చేసిన ఆరోపణల కారణంగా కేనిషా తీవ్రంగా బాధపడిందని, చివరకు తనకు దూరమై వెళ్లిపోయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేసినట్లు సమాచారం. అంతేకాదు.. కేనిషా తనకు కేవలం స్నేహితురాలు, హీలర్ మాత్రమేనని రవి మోహన్ స్పష్టం చేసినట్లు వార్తలు వచ్చాయి. ఆ సమయంలో తనపై వస్తున్న ఆరోపణలు, వ్యక్తిగత జీవితంలో నెలకొన్న పరిస్థితులు తనను తీవ్రంగా మానసికంగా ప్రభావితం చేస్తున్నాయని, సినిమాలపై కూడా దృష్టి పెట్టలేకపోతున్నానని ఆయన చెప్పినట్లు ప్రచారం జరిగింది.
ఇదిలా ఉండగా.. తాజాగా సోషల్ మీడియాలో ఓ వీడియో క్లిప్ వైరల్ అవుతోంది. అందులో రవి మోహన్, కేనిషా ఫ్రాన్సిస్ ఒకే సిగరెట్‌ను షేర్ చేసుకుంటూ మాట్లాడుకుంటున్నట్లుగా కనిపిస్తున్నారు. ఈ వీడియో బయటకు రావడంతో నెటిజన్లలో కొత్త చర్చ మొదలైంది. అయితే ఈ వీడియో ఎప్పుడు చిత్రీకరించబడింది? అసలు వీడియో నిజమైనదేనా? లేక ఎడిట్ చేసినదా? లేదా ఏఐ సాంకేతికతతో రూపొందించిన ఫేక్ విజువలా? అనే ప్రశ్నలు కూడా వ్యక్తమవుతున్నాయి. వీడియోకు సంబంధించిన పూర్తి వివరాలు, దాని అసలు సందర్భం ఇంకా స్పష్టంగా తెలియాల్సి ఉంది. రవి మోహన్ గతంలో కేనిషా తన నుంచి దూరంగా వెళ్లిపోయిందని చెప్పిన నేపథ్యంలో.. తాజాగా వైరల్ అవుతున్న వీడియోపై కొందరు నెటిజన్లు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. వీడియో ఇటీవలి కాలానికి సంబంధించినదే అయితే.. గతంలో రవి మోహన్ చేసిన వ్యాఖ్యలపై మరోసారి ప్రశ్నలు తలెత్తే అవకాశం ఉందని సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది.