Ghulam Nabi Azad : కాంగ్రెస్ మాజీ నేత గులాం నబీ ఆజాద్ ఈ మధ్యే పార్టీని వీడి సొంతంగా పార్టీ పెట్టిన విషయం తెలిసిందే. ఆయన సెప్టెంబర్‌లో డెమోక్రాటిక్ ఆజాద్ పార్టీ స్థాపించారు. అయితే పార్టీ పెట్టిన మూడు నెలల్లోనే ఆయనకు ఎదురుదెబ్బ తగిలింది. ముగ్గురు సీనియర్ నాయకులు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారు. దాంతో మాజీ మంత్రి తారా చంద్, మనోహర్ లాల్, బల్వాన్ సింగ్‌లను ఆజాద్ పార్టీ నుంచి బహిష్కరించారు. వాళ్లు పార్టీలో అవసరం లేదనే విషయం ఆజాద్‌కు అర్థమైంది. ఎందుకంటే వాళ్లు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారు అని ఆ పార్టీ నాయకుడు ఒకరు తెలిపారు. ఈ ముగ్గురిపై దర్యాప్తు చేసేందుకు పార్టీ జనరల్ సెక్రటరీ ఆర్ ఎస్ చిబ్‌తో కమిటీ వేశారు.
కాంగ్రెస్ అధిష్టానంపై అసంతృప్తితో గులాం నబీ ఆజాద్ పార్టీ వీడారు. సెప్టెంబర్ 26న డెమొక్రాటిక్ ఆజాద్ పార్టీ పెట్టారు. ఈయన రాజ్య సభలో ప్రతిపక్ష నాయకుడిగా పనిచేశారు. ఉమ్మడి జమ్ము కశ్మీర్‌కు 2005 నుంచి 2008 వరకు ముఖ్యమంత్రిగా కొనసాగారు.