Digital Condom | న్యూఢిల్లీ: బెడ్రూం కార్యకలాపాలు ఇటీవల సోషల్ మీడియాకెక్కి పరువును గంగపాలు చేస్తున్నాయి. ఈ ప్రైవేటు కార్యం రహస్య కెమెరాలకు చిక్కడంతో బోల్డన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది. దీంతో మధురంగా ఉండాల్సిన ఏకాంత క్షణాలు చేదు గుళికలుగా మారిపోతున్నాయి. అయితే, ఇకపై ఎలాంటి బెరుకు లేకుండా, తమను ఫొటోలు, వీడియోలు తీస్తారన్న భయం లేకుండా నిశ్చింతగా ఆ మధుర క్షణాలను ఆస్వాదించవచ్చు. ఇందుకోసం జర్మన్ సెక్సువల్ హెల్త్ బ్రాండ్ ‘బిల్లీ బాయ్’ సరికొత్త యాప్ను ఆవిష్కరించింది.
‘కమ్డోమ్”గా పిలిచే ఈ యాప్ ‘డిజిటల్ కండోమ్”గా వ్యవహరిస్తుంది. ఏకాంతంలో ఉన్నప్పుడు స్మార్ట్ఫోన్లలోని కెమెరాలు, మైక్రోఫోన్లు పనిచేయకుండా ఈ యాప్ అడ్డుకుంటుంది. ఇకపై ఏకాంతంలో మనకు తెలియకుండా ఆ సీన్లను వీడియోలు, ఫొటోలు తీయడం, ఆడియోను రికార్డు చేయడం జరగదని బిల్లీబాయ్ పేర్కొంది. ఈ యాప్ను 30 దేశాల్లో విడుదల చేశారు. ఇది బ్లూటూత్ సాంకేతికతతో సమీపంలోని స్మార్ట్ఫోన్లను నిర్వీర్యం చేసి ఏకాంతాన్ని ఆహ్లాదంగా మారుస్తుంది. ఎవరైనా వీడియోలు, ఫొటోలు తీయాలనుకున్నా కమ్డోమ్ యాప్ వెంటనే రియాక్ట్ అవుతుంది. అలారం మోగి యూజర్లను అప్రమత్తం చేస్తుంది.