న్యూఢిల్లీ, జూన్ 2 : ఆపరేషన్ సిందూర్ తర్వాత నరేంద్ర మోదీ ప్రభుత్వం చేస్తున్న ప్రచార వ్యూహాన్ని జియోస్ట్రాటజిస్ట్ బ్రహ్మ చెల్లానీ తప్పుపట్టారు. పాకిస్థాన్‌తో ఇటీవల జరిగిన సైనిక ఘర్షణలో భారతీయ యుద్ధ విమానాలకు నష్టం జరిగినట్లు భారత చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్(సీడీఎస్) అనిల్ చౌహాన్ సింగపూర్ సదస్సులో అంగీకరించడాన్ని ‘పూర్ పబ్లిక్ డిప్లొమసీ (పేలవమైన దౌత్యం)’ అని ఆయన అభివర్ణించారు. సింగపూర్‌లో జరిగిన సమావేశానికి సీడీఎస్‌ని మోదీ ప్రభుత్వం అనవసరంగా పంపిందన్నారు.
భారత్ యుద్ధ విమానాలను నష్టపోయినట్లు రాయిటర్స్ ఇంటర్వ్యూలో సీడీఎస్ అంగీకరించి, పాకిస్థాన్‌కు ప్రచార విజయాన్ని అందచేశారని సోమవారం ఎక్స్ వేదికగా చెల్లానీ విమర్శించారు. ఈ సైనిక ఘర్షణలో పాకిస్థాన్‌కు చేసిన నష్టాన్ని కూడా లెక్కలతో సహా వివరించి భారత గడ్డపై నుంచి అటువంటి ఒప్పుకోలు ప్రకటన చేసి ఉండవచ్చని బ్రహ్మ చెల్లానీ వ్యాఖ్యానించారు. సీడీఎస్ అనిల్ చౌహాన్ వ్యాఖ్యలు చేసిన సమయం, సందర్భాన్ని కూడా ఆయన ప్రశ్నించారు. పాకిస్థాన్ జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ చైర్మన్ కూడా హాజరైన సింగపూర్ వేదిక భారత్, పాక్‌ను ఒకే గాటన కట్టడానికి తోడ్పడిందని ఆయన వ్యాఖ్యానించారు.