ముంబై, మార్చి 23: ఓ మహిళా ఐఏఎస్ అధికారిని బదిలీ చేయాలని కోరుతూ మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండేకు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ లేఖ రాయడం వివాదంగా మారింది. తన భార్య సలహాదారుగా ఉన్న సంఘం ప్రయోజనాల కోసమే ఆయన ఈ లేఖ రాశారనే ఆరోపణలు వస్తున్నాయి. మహారాష్ట్ర వైద్య విద్యాశాఖ కార్యదర్శి అశ్విని జోషిని బదిలీ చేయాలని కోరుతూ మార్చి 9న సీఎం షిండే, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మనుకుమార్ శ్రీవాత్సవకు గడ్కరీ లేఖ రాశారు.
కాలేజ్ ఆఫ్ ఫిజీషియన్స్ అండ్ సర్జన్స్(సీపీఎస్) అనుబంధ సంస్థలకు చెందిన 1,100 సీట్లలో అడ్మిషన్ ప్రక్రియను అశ్విని జోషి నిలిపివేశారని ఆయన పేర్కొన్నారు. అయితే, సీపీఎస్ అనుబంధ సంస్థల సంఘానికి సలహాదారుగా నితిన్ గడ్కరీ సతీమణి కంచన్ గడ్కరీ ఉండటమే ఇప్పుడు వివాదమవుతున్నది. ఈ కారణంగానే ఆయన వ్యక్తిగతంగా తీసుకొని మహిళా ఐఏఎస్‌ను బదిలీ చేయించాలనుకుంటున్నారనే ఆరోపణలు వస్తున్నాయి.