బాబాయ్ శివపాల్ యాదవ్, అబ్బాయ్ అఖిలేశ్ మధ్య కొన్ని రోజులుగా పరోక్ష వార్ నడుస్తోంది. ఇప్పుడు బాబాయ్ శివపాల్ యాదవ్ ప్రత్యక్ష యుద్ధానికి తెరలేపారు. నిజంగా.. నేను అఖిలేశ్‌కు మద్దతివ్వడం లేదని ఆయనకు అనిపిస్తే.. వెంటనే తనను పార్టీ నుంచి తొలగించాలని సవాల్ విసిరారు. ప్రస్తుతం శివపాల్ యాదవ్ బీజేపీతో టచ్‌లో వున్నారని సమాజ్‌వాదీ అధ్యక్షుడు అఖిలేశ్ వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో శివపాల్ పై విధంగా ఘాటుగా స్పందించారు.
తనను పార్టీ నుంచి తొలగించడానికి అఖిలేశ్ ఏమాత్రం ఆలస్యం చేయవద్దని అన్నారు. నేనేమీ మిత్రపక్షం కాదు. సమాజ్‌వాదీ టిక్కెట్‌పైనే ఎన్నికల్లో గెలిచాను. పార్టీ నుంచి గెలుపొందిన 111 మంది ఎమ్మెల్యేల్లో నేనూ ఒకడ్ని. అందుకే నన్ను పార్టీ నుంచి బహిష్కరించే అధికారం అఖిలేశ్‌కు వుంది. అంటూ శివపాల్ యాదవ్ పేర్కొన్నారు. అయితే బీజేపీలో చేరే విషయంపై త్వరలోనే ఓ నిర్ణయాన్ని ప్రకటిస్తానని, చర్చలు మాత్రం జరుగుతున్నాయని శివపాల్ పేర్కొన్నారు.