డెహ్రాడూన్: అభివృద్ధి పనుల కోసం చెట్లను నరికివేయడంపై పర్యావరణవేత్తలు, పర్యావరణ ప్రేమికులు ఆందోళన వ్యక్తం చేశారు. నరికిన చెట్లకు నివాళి అర్పించారు. శవ యాత్ర నిర్వహించి నిరసన తెలిపారు. (Funeral Procession For Trees) ఉత్తరాఖండ్ రాజధాని డెహ్రాడూన్లో ఈ సంఘటన జరిగింది. రిషికేశ్-డెహ్రాడూన్ రహదారిని విస్తరించేందుకు 3,000కు పైగా చెట్లను నరికేందుకు ప్రతిపాదించారు. ఇప్పటికే వందలాది చెట్లను నరికివేశారు.
కాగా, అభివృద్ధి పనుల కోసం చెట్లను విచక్షణారహితంగా నరికివేయడంపై పర్యావరణవేత్తలు, మేధావులు ఆందోళన వ్యక్తం చేశారు. ఆదివారం డెహ్రాడూన్లో ‘సేవ్ ఎన్విరాన్మెంట్ మూవ్మెంట్ 2.0’పేరుతో ఉద్యమం చేపట్టారు. ఇప్పటి వరకు నరికిన చెట్లకు, త్వరలో నరికివేయనున్న చెట్లకు నివాళి అర్పించారు. నరికిన చెట్ల కొమ్మలతో సచివాలయం వరకు అంత్యక్రియల ఊరేగింపు నిర్వహించారు. అయితే మార్గమధ్యలో పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో అక్కడ బైఠాయించి నిరసన తెలిపారు.
మరోవైపు అభివృద్ధి పేరుతో చెట్లను నరికివేయడాన్ని నిషేధించాలని ప్రముఖ సామాజిక కార్యకర్త అనూప్ నౌటియాల్ డిమాండ్ చేశారు. 51 ఏళ్ల కిందట చిప్కో ఉద్యమం ఉత్తరాఖండ్లో ప్రారంభమైందని గుర్తు చేశారు. ఇప్పుడు దేశ చరిత్రలో తొలిసారిగా డెహ్రాడూన్లో నరికిన చెట్లకు అంత్యక్రియలు నిర్వహించినట్లు చెప్పారు. తమ నిరసన దేశమంతటా పర్యావరణంపై అవగాహన రేకెత్తిస్తుందని అన్నారు.
आज का दिन बेहद गमगीन रहा। आज सुबह कई नागरिकों ने साथ मिलकर #देहरादून की सड़कों पर #उत्तराखंड प्रदेश के पेड़ों और हरियाली के अंधाधुंध और रिकॉर्ड तोड़ कटान को लेकर शव यात्रा निकाली। मेरी भावभीनी श्रद्धांजलि।
— Anoop Nautiyal (@Anoopnautiyal1) March 30, 2025