న్యూఢిల్లీ : కరోనా మహమ్మారి తర్వాత దేశంలో ఇంధన డిమాండ్ భారీగా పెరిగింది. ఈ ఏడాది మార్చిలో డిమాండ్ మూడేళ్ల గరిష్టానికి చేరింది. 4.2శాతం పెరగడంతో మార్చిలో పెట్రోలియం ఉత్పత్తి వినియోగం 19.41 మిలియన్ టన్నులుగా నమోదైంది. ఈ వివరాలను చమురు మంత్రిత్వ శాఖ పెట్రోలియం ప్లానింగ్ అండ్ అనాలిసిస్ సెల్ డేటా తెలిపింది. కొవిడ్ మహమ్మారి ప్రభావం నుంచి ఆర్థిక వ్యవస్థ పుంజుకోవడంతో మార్చిలో రవాణా ఇంధనానికి డిమాండ్ పెరిగింది. దేశంలో అత్యధికంగా ఉపయోగించే ఇంధనం డీజిల్. కాగా, మొత్తం పెట్రోలియం ఉత్పత్తుల్లో దాదాపు 40శాతం వాటా ఉన్నది.
డిమాండ్ 6.7శాతం పెరిగి 7.7 మిలియన్ టన్నులకు చేరింది. వ్యవసాయరంగం నుంచి డిమాండ్‌తో పాటు ధరల పెరుగుదల వార్తల మధ్య నిల్వ చేయడంతో డీజిల్ వినియోగం ఎక్కువగా ఉన్నది. వంట గ్యాస్ (ఎల్పీజీ) డిమాండ్ మార్చిలో 9.8శాతం పెరిగి 2.48 మిలియన్ టన్నులకు చేరింది. మార్చి 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో ఇంధన డిమాండ్ 4.3శాతం పెరిగి 202.71 మిలియన్ టన్నులకు చేరింది. ఇది 2020 ఆర్థిక సంవత్సరం తర్వాత ఇదే అత్యధికం. ఆటో, వంట ఇంధన వినియోగం పెరిగినప్పటికీ పారిశ్రామిక రంగంలో ఇంధన వృద్ధి తగ్గింది. 2021-22లో పెట్రోలు వినియోగం 10.3 శాతం పెరిగి 30.85 మిలియన్ టన్నులు కాగా, డీజిల్ అమ్మకాలు 5.4 శాతం పెరిగి 76.7 మిలియన్ టన్నులకు చేరుకున్నాయి. 2019-20లో 82.6 మిలియన్ టన్నుల వినియోగం తర్వాత డీజిల్ అమ్మకాలు అత్యధికంగా ఉండగా, ఆర్థిక సంవ్సరం-22లో పెట్రోల్‌కు డిమాండ్ ఎప్పుడూ లేనంతగా ఉంది.
ఎల్పీజీ వినియోగం 3 శాతం పెరిగి 28.33 మిలియన్ టన్నులకు చేరుకుంది. విమానాల ఇధనం (ATF) డిమాండ్ ఐదు మిలియన్ టన్నులకు పెరిగింది. కరోనా పరిస్థితుల తర్వాత ఇటీవల పూర్తిస్థాయిలో విమానయాన సేవలు ప్రారంభించడమే ఇందుకు ప్రధాన కారణం. పెట్రోలియం కోక్ వినియోగం 9.7 శాతం తగ్గి 14.1 మిలియన్ టన్నులకు చేరుకోగా, 2022 ఆర్థిక సంవత్సరంలో కిరోసిన్ డిమాండ్ 17 శాతం తగ్గి 1.5 మిలియన్ టన్నులకు చేరుకుంది. పరిశ్రమలలో ఇంధనంగా ఉపయోగించే నాఫ్తా, అలాగే రోడ్డు నిర్మాణంలో ఉపయోగించే బిటుమెన్ వినియోగం స్వల్పంగా పెరిగి వరుసగా 14.2 మిలియన్ టన్నులు, 7.7 మిలియన్ టన్నులకు పెరిగింది.