న్యూఢిల్లీ: సోషల్ మీడియాలో పరిచయమైన వ్యక్తితో ఒక మహిళకు స్నేహం ఏర్పడింది. అతడ్ని పెళ్లి చేసుకోవాలని భావించింది. అయితే ఆమెకు కుమార్తె ఉండటంతో ఆ వ్యక్తి కుటుంబం పెళ్లికి నిరాకరించింది. దీంతో దిగులు చెందిన ఆ మహిళ ఆ విసుగులో కన్న బిడ్డను హత్య చేసింది. (Mother Kills Daughter) దేశ రాజధాని ఢిల్లీలో ఈ సంఘటన జరిగింది. భర్త నుంచి విడిపోయిన ఒక మహిళ కొంతకాలం హిమాచల్ ప్రదేశ్లోని బంధువుల ఇంట్లో నివసించింది.
కాగా, ఢిల్లీకి చెందిన రాహుల్ ఇన్స్టాగ్రామ్లో ఆ మహిళకు పరిచయమయ్యాడు. వారిద్దరి మధ్య స్నేహం ప్రేమగా మారింది. దీంతో పెళ్లి చేసుకోవాలని భావించారు. దీని కోసం ఆమె ఢిల్లీకి మకాం మార్చింది. ఐదేళ్ల కుమార్తె, ఇతర కుటుంబ సభ్యులతో కలిసి అశోక్ విహార్లో నివసిస్తున్నది.
మరోవైపు పెళ్లి కోసం రాహుల్, అతడి కుటుంబాన్ని ఆ మహిళ సంప్రదించింది. అయితే ఆమెకు కుమార్తె ఉండటంతో పెళ్లికి వారు నిరాకరించారు. ఈ నేపథ్యంలో పెళ్లి నిరాకరణపై ఆమె దిగులు చెందింది. ఆ విసుగులో శుక్రవారం ఐదేళ్ల కుమార్తె గొంతునొక్కి చంపింది. ఆ బాలికను ఆసుపత్రికి తీసుకెళ్లగా గొంతు నొక్కిన ఆనవాళ్లను డాక్టర్లు గమనించారు. దీంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు.
కాగా, బాలిక తల్లిని పోలీసులు ప్రశ్నించగా తానే హత్య చేసినట్లు ఒప్పుకున్నది. ఇన్స్టాగ్రామ్లో పరిచయమైన వ్యక్తితో పెళ్లి నిరాకరణ నేపథ్యంలో విసుగుతో చంపినట్లు చెప్పింది. ఆ మహిళపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.