తిరువనంతపురం: కేరళ కాంగ్రెస్ పార్టీలో ఉన్న చురుకైన వ్యక్తుల్లో వీడీ సతీశన్ ఒకరు. ఆ రాష్ట్ర రాజకీయాల్లో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉన్నది. వాస్తవాలు చెప్పడంలో.. వాదనల్లో క్లారిటీ.. అసెంబ్లీలో ప్రత్యర్థులను ఢీకొట్టడంలో సతీశన్ సమర్థుడు. అనేక మంది కాంగ్రెస్ నేతలు ఆయన్ను దాటుకుని వెళ్లినా ఆయన మాత్రం తన అవకాశం కోసం ఎదురూచూశారు. తాజాగా ముగిసిన అసెంబ్లీ ఎన్నికల్లో యూడీఎఫ్ కూటమికి 102 సీట్లు వచ్చాయి. అయితే కాంగ్రెస్ విక్టరీలో కీలక పాత్ర పోషించిన సతీశన్‌కు సీఎం బాధ్యతలను ఆ పార్టీ అధిష్టానం అప్పగించింది.
సతీశన్ వయసు 61 ఏళ్లు. ఆయనేమీ సడెన్‌గా సీఎం కాలేదు. దశాబ్ధాలుగా తన స్థానాన్ని రాజకీయాల్లో సుస్థిరం చేసుకున్నారు. పట్టుదల, క్రమశిక్షణ, నిరంతర శ్రమతో ఆయన రాణించారు. ఎర్నాకుళం జిల్లా నెట్టూరులో ఆయన మే 31, 1964లో జన్మించారు. ఆయన తండ్రి పేరు వదసెరి దమోదర మీనన్. ఆయన ఫారెస్ట్ శాఖ అధికారి. తల్లి పేరు విలాసిని అమ్మ. సతీశన్ న్యాయ విద్యలో పట్టభద్రుడు. రాజకీయాల్లోకి రాకముందే ఆయన అడ్వకేట్ గా చేశారు. విద్యార్థి దశలోనే సతీశన్ రాజకీయాలు చేశారు. తీవరలోని ఎస్‌హెచ్ కాలేజీలో యూనియన్ ఆఫీస్ బియరర్‌గా చేశారు. ఎంజీ యూనివర్సిటీ యూనియన్‌కు చైర్మెన్ అయ్యారు. ఎన్ఎస్యూఐలో జాతీయ కార్యదర్శిగా చేశారు.
పారవూరు నియోజకవర్గం సతీశన్‌కు కంచుకోట. రెండు దశాబ్ధాలుగా ఆయన ఆ స్థానం నుంచి గెలుపొందుతున్నారు. 1996లో తొలిసారి ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. ఆ సమయంలో ఆ నియోకవర్గం సీపీఐ పట్టున్న సీటుగా భావించారు. సీపీఐ అభ్యర్థి రాజు చేతిలో వెయ్యి ఓట్లతో ఆయన పరాజయం చవిచూశారు. ఓడినా ఆయన ఆ నియోజకవర్గాన్ని వీడలేదు. పట్టుదలతో తన కేడర్‌ను నిర్మించుకున్నారు. ఇక ఆ తర్వాత పారవూరు ఏకంగా కాంగ్రెస్ సీటుగా మారిపోయింది. 2001, 2006, 2011, 2016, 2021, 2026 ఎన్నికల్లో ఆయన ఆ స్థానం నుంచే ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే కాంగ్రెస్ పార్టీలో ఉన్న అంతర్గత కుమ్ములాటల వల్ల సతీశన్ చాన్నాళ్లు సైలెంట్‌గా ఉండిపోయారు. కేఎస్‌యూ ప్రెసిడెంట్, యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్, కేపీసీసీ ప్రెసిడెంట్ అయ్యే సందర్భాలను అనేక సార్లు ఆయన మిస్సయ్యారు.
కేరళ అసెంబ్లీలో పబ్లిక్ అకౌంట్స్ కమిటీ అండ్ ఎస్టిమేట్స్ కమిటీ చైర్మెన్‌గా చేశారు. తమిళనాడుకు ఏఐసీసీ సెక్రటరీ ఇంచార్జీగా చేశారు. కేపీసీసీ వైస్ ప్రెసిడెంట్‌గా అయిదేళ్లు చేశారు. 2016 ఒమన్ చండీ ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ విప్‌గా చేశారు. 2021లో యూడీఎఫ్ దారుణంగా ఓడింది. ఆ సమయంలో సీనియర్ నేతలను పక్కనపెట్టి, సతీశన్‌ను ప్రతిపక్ష నేతగా ప్రకటించారు. కేరళ రాజకీయాల్లో ప్రత్యేక పేరును సతీశన్ సంపాదించారు. ఒమన్ చండీ సర్కారు ఉన్న సమయంలో అసెంబ్లీలో సతీశన్ 33 వాయిదా తీర్మానాలను ఇచ్చారు. ఇది కేరళ అసెంబ్లీలో ఓ రికార్డు క్రియేట్ చేసింది.
ఫ్యాక్షన్ రాజకీయాలకు భిన్నంగా తన ఎన్నికల ప్రచారాల్లో సమస్యలపై ఫోకస్ పెట్టి ప్రసంగించారు. వాస్తవాలతో ప్రత్యర్థులపై ఆయన దాడి చేసేవారు. యూడీఎఫ్‌లో ఉన్న లుకలుకలను రూపుమాపే ప్రయత్నం చేశారు. బలమైన పినరయి విజయన్ ప్రభుత్వాన్ని ఎదుర్కొనేందుకు సతీశన్ చాలా సమర్ధుడిగా ఉన్నట్లు కాంగ్రెస్ నేతలు భావించారు. ప్రతిపక్ష నేతగా యూడీఎఫ్‌కు గట్టి పోటీ ఇచ్చారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో యూడీఎఫ్ ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. కేరళలో 20 స్థానాల్లో యూడీఎఫ్ 18 స్థానాలు గెలుచుకున్నది. 2025 లోకల్ బాడీ ఎన్నికల్లో కూటమి విజయంలోనూ సతీశన్ కీలక పాత్ర పోషించారు. తిరక్కకర, పుత్తుపల్లి, నీలాంబుర్ ఉప ఎన్నికల్లో యూడీఎఫ్ విజయం కోసం శ్రమించారు.
ఎల్డీఎఫ్ ప్రభుత్వం, సీఎం విజయన్ను తీవ్రంగా విమర్శించారు. ప్రభుత్వ వైఫల్యాలను గట్టిగా ప్రశ్నించారు. కేరళ ప్రతిపక్ష నేతగా సతీశన్ అంచలంచెలుగా ఎదిగారు. పార్టీ పరంగా రాజకీయమైన కఠిన నిర్ణయాలను ఆయనే తీసుకున్నారు. ఎమ్మెల్యే రాహుల్ మామ్కూటతిల్ వివాదం సమయంలో సరైన నిర్ణయం తీసుకున్నట్లు సతీశన్‌పై ప్రశంసలు వచ్చాయి. వీడీ సతీశన్‌కు పర్యావరణవేత్తగా కేరళలో గుర్తింపు ఉన్నది. పశ్చిమ కనుమల రక్షణ కోసం ఏర్పాటు అయిన మాధవ్ గాడ్గిల్ కమిటీ నివేదికకు ఆయన మద్దతు ఇచ్చారు. యూడీఎఫ్‌లోనే భిన్న అభిప్రాయాలు ఉన్నా.. ఆయన మాత్రం అక్రమ మైనింగ్, భూ ఆక్రమణ వ్యతిరేకించారు.
2024లో వయనాడ్‌లో కొండచరియలు విరిగిపడ్డ సమయంలో.. రాష్ట్ర ప్రభుత్వ డిజాస్టర్ మేనేజ్మెంట్ వ్యవస్థను సతీశన్ విమర్శించారు. నియంత్రణ లేని టూరిజం కన్నా.. సుస్థిర అభివృద్ధి ప్రణాళికలు చేపట్టాలని సూచించారు. సతీశన్ కెరీర్లో కొన్ని వివాదాలు కూడా ఉన్నాయి. పునర్జని ప్రాజెక్టు కోసం ఆయన విదేశీ నిధులు సేకరించినట్లు ఆరోపణలు ఉన్నాయి. 2018 వరద బాధితల కోసం ఆ నిధులను సేకరించారు. కానీ విజిలెన్స్ రిపోర్టులో ఆయనకు క్లియరెన్స్ దక్కింది. చూరల్మాలా ముండక్కై డిజాస్టర్ బాధితుల కోసం సేకరించిన డబ్బును ఎన్నికల ప్రచారం కోసం వాడినట్లు ఆరోపణలు ఉన్నాయి. 2022లో ఆర్ఎస్ఎస్తో లింకున్న ఓ కార్యక్రమానికి సతీశన్ హాజరైనట్లు కొన్ని ఫోటోలు రిలీజ్ అయ్యాయి. కానీ కేవలం బుక్ రిలీజ్ కోసం హాజరైనట్లు ఆయన చెప్పారు.
ఎర్నాకుళంలో స్టూడెంట్ నేత నుంచి ఆరు సార్లు ఎమ్మెల్యేగా సతీశన్ తన ప్రస్థానం కొనసాగించారు. కేరళ రాజకీయాల్లో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నారు. ఎన్నో ఏళ్ల ఎదురుచూపులు, ఎదురుదెబ్బల తర్వాత ఇప్పుడు హైకమాండ్ ఆదేశాలతో సతీశన్ ముఖ్యమంత్రి పదవిని చేపట్టనున్నారు.