Donkey Route | చండీగఢ్, ఫిబ్రవరి 17: అమెరికాకు చట్టబద్ధంగా తీసుకువెళతామని వాగ్దానం చేసిన ట్రావెల్ ఏజెంట్లు మోసం చేసి డంకీ మార్గంలో తీసుకెళ్లడంతో పంజాబ్‌కు చెందిన మన్దీప్ సింగ్ తన ప్రాణాన్ని పణంగా పెట్టి మొసళ్లు, పాముల నుంచి కాపాడుకుంటూ తన కలల స్వర్గం అమెరికాను చేరుకోగలనని భావించాడు. సిక్కు మతానికి చెందిన వాడైనప్పటికీ తన గడ్డాన్ని క్లీన్షేవ్ చేయాల్సి వచ్చింది. తన కుటుంబానికి మంచి జీవితాన్ని అందచేయాలన్న ఏకైక లక్ష్యంతో అమెరికా వెళ్లేందుకు అష్టకష్టాలు పడ్డ మన్దీప్ కన్న కలలన్నీ అరెస్టుతో పేకమేడల్లా కూలిపోయాయి. మెక్సికోలోని టిజువానా నుంచి అమెరికాలోకి చొరపడేందుకు ప్రయత్నించి జనవరి 27న అమెరికా సరిహద్దు గస్తీ పోలీసులకు మన్దీప్ దొరికిపోయాడు.
ఆదివారం రాత్రి చండీగఢ్ విమానాశ్రయం చేరుకున్న 112 మంది అక్రమ వలసదారులకు చెందిన మూడవ విమానంలో మన్దీప్ సింగ్ కూడా ఉన్నాడు. పంజాబ్‌కు చెందిన మన్దీప్ సింగ్(38) తన డంకీ ప్రయాణ అనుభవాలను మీడియాతో పంచుకున్నాడు. ఆ ప్రయాణానికి సంబంధించిన వీడియోలను కూడా అతను చూపించాడు. చట్టబద్ధంగా నెలరోజుల్లో అమెరికాకు పంపిస్తానని వాగ్దానం చేసిన ట్రావెల్ ఏజెంట్ రూ. 40 లక్షలు డిమాండ్ చేశాడని మన్దీప్ చెప్పాడు.
తాను రెండు విడతలుగా ఈ మొత్తాన్ని చెల్లించానని అతను తెలిపాడు. గత ఏడాది ఆగస్టులో అమృత్సర్ నుంచి ఢిల్లీకి విమానంలో తన ప్రయాణం మొదలైందని మన్దీప్ చెప్పాడు. “ పనామా అడవులలో కాలినడకన మా ప్రయాణం సాగింది. ఎవరైనా ప్రశ్నిస్తే కాల్చివేస్తామని మా వెంట ఉన్నవారు బెదిరించారు. అలా 13 రోజులపాటు అడవుల్లో మా ప్రయాణం రహస్యంగా సాగింది. 12 వాగులను దాటుకుటూ మొసళ్లు, పాములను తప్పించుకుంటూ ప్రయాణం సాగించాం. పాముల నుంచి కాపాడుకునేందుకు కొందరికి కర్రలను కూడా ఇచ్చారు. సగం కాలిన రొట్టెలు ఇచ్చారు. కొన్నిసార్లు నూడుల్స్ పెట్టారు. అలా రోజుకు 12 గంటలపాటు నడుస్తూ మా ప్రయాణం సాగించాం. పనామాను దాటిన తర్వాత కోస్టారికాలో ఆగాము. అక్కడి నుంచి హోండురాస్‌కు బయల్దేరాము.
ఎట్టకేలకు అక్కడ మాకు కొద్దిగా అన్నం దొరికింది. అయితే నికరగ్వా మీదుగా గ్వాటెమాలా దాటుతుండగా అదృష్టవశాత్తు కొద్దిగా పెరుగన్నం తిన్నాము. మేము టిజువానా చేరుకున్న వెంటనే నా గడ్డం బలవంతంగా తొలగించారు. అక్కడి నుంచి అమెరికాలోకి చొరబడేందుకు మేము ప్రయత్నిస్తుండగా జనవరి 27న అమెరికా గస్తీ పోలీసులు మమల్ని అరెస్టు చేశారు అని మన్దీప్ మీడియాకు వివరించాడు. తమను భారత్‌కు పంపించివేస్తున్నట్టు అమెరికా అధికారులు తమకు చెప్పారని అతను తెలిపాడు. విమానం ఎక్కించడానికి ముందు కొద్ది రోజులు తమను డిటెన్షన్ సెంటర్లో ఉంచారని అతను చెప్పాడు. భారత్‌కు చెందిన అక్రమ వలసదారులతో మొదటి అమెరికన్ సైనిక విమానం ఫిబ్రవరి 5న అమృత్సర్ చేరుకుంది.