Joseph Vijay : తెలుగు నాట, తమిళ నాట సినిమా స్టార్స్‌ను ప్రేక్షకులు అభిమానించి, ఆదరించే తీరు చాలా ప్రత్యేకం. స్టార్స్‌ను కొందరు తమ ఇంటి మనుషుల్లా చూస్తారు. మరికొందరు డెమీ గాడ్స్‌గా చూస్తారు. అందుకే స్టార్స్ రాజకీయ రంగంలోనూ తమదైన ముద్ర వేస్తున్నారు. రాజకీయ పార్టీలు స్థాపించి, ఏకంగా రాష్ట్రాలకు సీఎంలు అవుతున్నారు. అది కూడా పార్టీ పెట్టిన తర్వాత తొలి ఎన్నికల్లోనే అఖండ విజయం సాధించి సీఎంలు అవుతున్నారు. తాజాగా టీవీకే పార్టీ అధినేత, సూపర్ స్టార్ విజయ్ కూడా తమిళనాడు సీఎం పదవి చేపట్టబోతున్నారు.
విజయ్ కంటే ముందు ఇద్దరు స్టార్స్ మాత్రమే ఇలా పార్టీలు స్థాపించి, మొదటి ఎన్నికల్లోనే విజయం సాధించారు. వారు ఒకరు ఎంజీఆర్. రెండోది ఎన్టీఆర్. తమిళనాడులో పెద్ద హీరోగా ఉన్న ఎంజీఆర్ (ఎంజీ రామచంద్రన్) 1972లో ఏఐఏడీఎంకే స్థాపించారు. ఆయన డీఎంకే పార్టీ నుంచి బయటకు వచ్చి తన సొంత పార్టీని ఏర్పాటు చేసుకున్నారు. ఆ తర్వాత మొదటిసారి 1977లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించారు. తమిళనాడు సీఎంగా పదవి చేపట్టారు. అంటే పార్టీ పెట్టిన తర్వాత జరిగిన తొలి ఎన్నికల్లోనే ఆయన ఘన విజయం సాధించారు. ఆయన తర్వాత తెలుగు వారికి సంబంధించి అప్పట్లో ఉమ్మడి ఏపీలో సీనియర్ స్టార్ ఎన్టీఆర్ పార్టీని స్థాపించారు.
1982లో టీడీపీని స్థాపించి, 1983లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పాల్గొని భారీ విజయం సాధించారు. తొలిసారి పోటీ చేసిన ఎన్నికల్లోనే విజయం సాధించిన ఎన్టీఆర్ సీఎం పదవి చేపట్టారు. అప్పట్లో ఆయన 201 సీట్లు గెలిచారు. ఆ తర్వాత నటుడు విజయ్ ఇప్పుడు తమిళనాడులో టీవీకేను స్థాపించి, అధికారం చేపట్టబోతున్నారు. ఆయన 2024లో పార్టీని స్థాపించారు. ఆ తర్వాత జరుగుతున్న తొలి అసెంబ్లీ ఎన్నికలివి. ఈ ఎన్నికల్లోనే విజయం సాధించి సీఎం పదవి చేపట్టేందుకు ఆయన సిద్ధమవుతున్నారు. ఇప్పటివరకు భారతీయ సినీ పరిశ్రమకు సంబంధించి ముగ్గురు నటులు ఇలా పార్టీలు స్థాపించి, ఆ వెంటనే సీఎం పదవి చేపట్టారు.
ఈ ముగ్గురూ కాకుండా తమిళనాడులో విజయ్ కాంత్, కమల్ హాసన్, ఉమ్మడి ఏపీలో చిరంజీవి, ఏపీలో పవన్ కళ్యాణ్, కర్ణాటకలో నటుడు ఉపేంద్ర వంటి వారు పార్టీలు స్థాపించినప్పటికీ సీఎంలు కాలేకపోయారు. వీరిలో చిరంజీవి కేంద్ర మంత్రికాగా, పవన్ కల్యాణ్ ఏపీ డిప్యూటీ సీఎంగా కొనసాగుతున్నారు.