న్యూఢిల్లీ: లోక్‌సభలో మంగళవారం సభ్యుల ప్రమాణ స్వీకారాలు కొనసాగాయి. సోమవారంతో కలిపి 542 మందికిగానూ 535 మంది ప్రమాణాలు చేయగా.. ఇంకా ఏడుగురు సభ్యులు ఈ ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉన్నదని లోక్‌సభ వర్గాలు వెల్లడించాయి. సభ్యుల ప్రమాణ స్వీకారాల సందర్భంగా పలు రకాల నినాదాలు ఇచ్చారు. జై హింద్, జై సంవిధాన్, జై జవాన్, జై కిసాన్, జై భీమ్, జై మండల్, జై మహారాష్ట్ర, జై శివాజీ తదితర నినాదాలు పలువురు సభ్యుల నోట నుంచి వినిపించాయి. దీంతో ‘ఇచ్చిన పేపర్‌పై ఉన్నది మాత్రమే చదవండి’ అని ప్రొటెం స్పీకర్ ఓ సందర్భంగా సభ్యులకు సూచించారు.
హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ప్రమాణం అనంతరం ‘జై పాలస్తీనా’ అని నినదిండంపై లోక్‌సభలో దుమారం రేగింది. ప్రమాణం చేసిన అనంతరం ఒవైసీ ‘జై భీమ్, జై మీమ్, జై తెలంగాణ, జై పాలస్తీనా’ అంటూ నినాదం ఇచ్చారు. దీనిపై అధికార సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. కొంత సేపు ఈ అంశంపై సభలో గందరగోళం నెలకొన్నది. ప్రమాణ స్వీకారం కాకుండా మిగతా అంశాలు రికార్డుల్లోకి రావని స్పీకర్ చైర్లో కూర్చొన్న ప్రొటెం స్పీకర్ ప్యానెల్ సభ్యుడు రాధా మోహన్ సింగ్ పేర్కొన్నారు.
లోక్‌సభలో తమిళనాడుకు చెందిన కాంగ్రెస్ ఎంపీ గోపీనాథ్ తెలుగులో ప్రమాణ స్వీకారం చేయడం ఆసక్తికరంగా మారింది. ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో కృష్ణగిరి నుంచి గెలిచిన గోపీనాథ్.. రాజ్యాంగం ప్రతిని చేతిలో పట్టుకొని తెలుగులో ప్రమాణం చేశారు. గోపీనాథ్ గతంలో పలుమార్లు తమిళనాడు అసెంబ్లీకి ఎమ్మెల్యేగా కూడా ఎన్నికయ్యారు. అసెంబ్లీలో కూడా తెలుగులోనే ప్రమాణ స్వీకారం చేయడంతోపాటు పలు అంశాలపై ఆయన తెలుగు భాషలోనే మాట్లాడేవారు.