Temperature | ఢిల్లీ : వాతావరణంలో మార్పుల కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఉష్ణోగ్రతల్లో ఆకస్మిక మార్పులు (టెంపరేచర్ ఫ్లిప్స్) చోటుచేసుకుంటున్నట్టు శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భూతాపం వల్ల ఒక్కసారిగా అత్యంత వేడి నుంచి శీతలం.. శీతలం నుంచి అత్యంత వేడి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్టు పరిశోధకులు చెబుతున్నారు. ఇలాంటి పరిణామాలు మానవులకు, వాతావరణానికి తీవ్ర ప్రమాదకరమని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మానవ ప్రేరేపిత వాతావరణ మార్పుల వల్ల 1961 నుంచి ప్రపంచవ్యాప్తంగా 60 శాతం ప్రాంతాలు దీని ప్రభావానికి లోనయ్యాయని, ఇలాంటి ఆకస్మిక ఉష్ణోగ్రతల మార్పులు సర్వసాధారణమయ్యాయని, తీవ్రంగా, వేగంగా సంభవిస్తున్నాయని తాజా అధ్యయనంలో వెల్లడైంది. ఈ మేరకు ‘నేచర్ కమ్యూనికేషన్స్’లో అధ్యయన వివరాలు ప్రచురితమయ్యాయి.
2012 మార్చిలో ఉత్తర అమెరికాలోని కొన్ని ప్రాంతాల్లో ఆకస్మికంగా -10 డిగ్రీల సెల్సియస్ నుంచి 5 డిగ్రీల సెల్సియస్ మధ్యలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని శాస్త్రవేత్తలు గుర్తించారు. 2020 సెప్టెంబర్లో రాకీ పర్వతాల్లో ఒక్కరోజు వ్యవధిలో 20 డిగ్రీల సెల్సియస్ వరకు ఉష్ణోగ్రతలు పడిపోయినట్టు అధ్యయనంలో వెల్లడైంది. ఆ ప్రాంతంలో ఒక్కసారిగా ఉష్ణోగ్రతలు పడిపోయి, తీవ్రంగా మంచు కురిసినట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు. భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు ఆకస్మికంగా మార్పులకు లోనయ్యే ప్రమాదముందని వారు చెబుతున్నారు. కర్బన ఉద్గారాల వాడకం తగ్గకపోతే ఈ శతాబ్దం చివరి నాటికి ప్రమాదపుటంచుల్లో ఉన్నవారి శాతం 100కు చేరుతుందని హెచ్చరిస్తున్నారు.