న్యూఢిల్లీ : కష్టనష్టాలు, ఒడుదొడుకులను తట్టుకుని, అనేక సంవత్సరాలు వర్ధిల్లే స్నేహం వల్ల శరీరానికి ముసలితనం రావడం ఆలస్యమవుతుంది. ఇటువంటి అనుబంధాలు శరీరాంతర్గత గడియారాలను ‘రీసెట్’ చేసి, జీవ సంబంధిత వయసును తగ్గిస్తాయి. ‘బ్రెయిన్, బిహేవియర్ అండ్ ఇమ్యూనిటీ-హెల్త్’ జర్నల్లో ప్రచురితమైన అధ్యయన నివేదిక ఈ వివరాలను తెలిపింది. ఈ అధ్యయనంలో 2,117 మంది వయోజనులు పాల్గొన్నారు.
స్నేహం వల్ల క్రమంగా పెరుగుతూ వచ్చే సామాజిక ప్రయోజనాలు గల వారి జీవ సంబంధిత వయసు పెరుగుదల రేటు నెమ్మదిగా ఉన్నట్లు పరిశోధకులు గుర్తించారు. వీరిలో క్రానిక్ ఇన్ఫ్లమేషన్ లెవెల్స్ కూడా తగ్గినట్లు గమనించారు. శరీర జన్యుపరమైన వయసు గడియారంపై ఈ అధ్యయనం దృష్టి పెట్టింది. జీవ సంబంధిత వయసు పెరుగుదల వేగాన్ని అంచనా వేయడానికి ఇది ఉపయోగపడుతుంది.