ముంబై: దంపతుల సన్నిహిత వీడియోలను వారి ఫ్రెండ్ పోర్న్ సైట్లో అప్లోడ్ చేశాడు. (Couple’s Intimate Videos) వాటిని తొలగిస్తానని చెప్పి మహిళ నుంచి డబ్బులు తీసుకున్నాడు. ఆ తర్వాత ఆ వీడియోలు, ఫొటోలను సోషల్ మీడియాలో వైరల్ చేశాడు. మహిళ ఫిర్యాదుతో దర్యాప్తు చేసిన పోలీసులు ఆ వ్యక్తిని అరెస్ట్ చేశారు. మహారాష్ట్ర రాజధాని ముంబైలో ఈ సంఘటన జరిగింది. ఒక మహిళ భర్త మద్యానికి బానిస అయ్యాడు. దీంతో దంపతుల మధ్య తరచుగా గొడవలు జరిగేవి. ఈ నేపథ్యంలో భార్య పరువు తీయాలన్న ఉద్దేశంలో వారి సన్నిహిత ఫొటోలు, వీడియోలను మొబైల్ ఫోన్లో భర్త రికార్డ్ చేశాడు. తన స్నేహితుడైన జాషువా ఫ్రాన్సిస్‌కు వాటిని షేర్ చేశాడు.
కాగా, ఆ భార్యాభర్తల సన్నిహిత వీడియోలను పోర్న్ సైట్లో ఫ్రాన్సిస్ అప్లోడ్ చేశాడు. ఆ లింక్‌ను ఆ మహిళకు పంపాడు. ఈ వీడియోల పట్ల ఆందోళన చెందుతున్నట్లు నటించాడు. తన స్నేహితుడు వికాస్ సైబర్ నిఫుణుడని, వాటిని తొలగిస్తాడని చెప్పాడు.
మరోవైపు వికాస్ పేరుతో ఫ్రాన్సిస్ ఆ మహిళకు వాట్సాప్ కాల్ చేశాడు. రూ.50,000 ఇస్తే ఆ వీడియోలను పోర్న్ సైట్ నుంచి తొలగిస్తానని చెప్పాడు. దీంతో ఆమె ఆ డబ్బులు పంపింది. అయితే కొన్ని రోజుల తర్వాత ఆ వీడియోలు, ఫొటోలు ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ అయ్యాయి. ఆ మహిళ దృష్టికి వెళ్లడంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది.
కాగా, దర్యాప్తు చేసిన పోలీసులు భార్యాభర్తల సన్నిహిత వీడియోలను వారి ఫ్రెండ్ ఫ్రాన్సిస్ పోర్న్ సైట్లో అప్లోడ్ చేయడంతోపాటు సోషల్ మీడియాలో వైరల్ చేసినట్లు గుర్తించారు. బుధవారం అతడ్ని అరెస్ట్ చేశారు. భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్), ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.