Nirav Modi : భారత్ నుంచి పారిపోయిన ప్రముఖ వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ (Nirav Modi) కి లండన్ హైకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. బ్యాంక్ ఆఫ్ ఇండియా (Bank of India) దాఖలు చేసిన కేసులో నీరవ్ మోదీ తన కంపెనీ రుణం కోసం ఇచ్చిన వ్యక్తిగత గ్యారెంటీ 10.7 మిలియన్ డాలర్ల (సుమారు రూ.100 కోట్లు) కంటే ఎక్కవ చెల్లించాల్సిందేనని కోర్టు తీర్పునిచ్చింది. లండన్ సర్క్యూట్ కమర్షియల్ కోర్ట్ జడ్జి జస్టిస్ సైమన్ టింక్లర్ జూన్ 23 నాటి తీర్పులో ఈ విషయాన్ని స్పష్టంచేశారు. అసలు మొత్తం 4.1 మిలియన్ డాలర్లతో పాటు దానికి సంబంధించిన వడ్డీని కూడా నీరవ్ మోదీ నుంచి వసూలు చేయాలని ఆదేశించారు.
ఈ గ్యారెంటీ చెల్లదని, తనకు సరైన డిమాండ్ నోటీసులు రాలేదని నీరవ్ మోదీ చేసిన వాదనలను కోర్టు పూర్తిగా తోసిపుచ్చింది. బ్యాంక్ ఆఫ్ ఇండియా జూలై 2012లో దుబాయ్ ఆధారిత ‘ఫైర్‌స్టార్ డైమండ్ ఎఫ్జెడ్ఈ’ అనే నీరవ్ మోదీకి చెందిన సంస్థకు భారీ రుణాన్ని మంజూరు చేసింది. ఈ రుణ సదుపాయానికిగాను ఆగస్టు 3, 2013న నీరవ్ మోదీ వ్యక్తిగత పూచీకత్తు ఇచ్చారు. అయితే 2018 ప్రారంభంలో పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో జరిగిన భారీ కుంభకోణం వెలుగులోకి రావడంతో.. బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ రుణాన్ని వెనక్కి తీసుకుంది.
2018 మార్చి, ఏప్రిల్ నెలలతోపాటు అక్టోబర్ 2025లో కూడా బ్యాంకు పంపిన డిమాండ్ నోటీసులను నీరవ్ మోదీ, అతడి కంపెనీ పట్టించుకోలేదు. పీఎన్బీ కుంభకోణం కారణంగా ఫైర్‌స్టార్ గ్రూప్ కార్యకలాపాలు, నీరవ్ మోదీ అప్పులు తీర్చే సామర్థ్యం పూర్తిగా దెబ్బతిన్నాయని, అందువల్ల రుణాన్ని వెనక్కి తీసుకోవడం సమర్థనీయమేనని కోర్టు అభిప్రాయపడింది. కాగా ఈ అసలు మొత్తానికి సంబంధించిన సమ్మరీ జడ్జిమెంట్ మార్చి 2024 లోనే వెలువడింది. దేశంలో దాదాపు రూ. 13,000 కోట్ల పీఎన్బీ రుణ మోసానికి పాల్పడిన కేసులో ప్రధాన నిందితుడైన నీరవ్ మోదీ.. మార్చి 2019లో అరెస్ట్ అయినప్పటి నుంచి యూకే జైల్లోనే శిక్ష అనుభవిస్తున్నారు.
మనీలాండరింగ్, మోసం కేసులను ఎదుర్కొనేందుకు వీలుగా తనను భారతదేశానికి అప్పగించాలన్న నిర్ణయంపై ఆయన ఇంకా చట్టపరమైన పోరాటం చేస్తూనే ఉన్నారు. ఈ తాజా తీర్పుతో నీరవ్ మోదీపై ఆర్థిక, చట్టపరమైన ఒత్తిడి మరింత పెరిగింది. సీబీఐ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వంటి భారతీయ దర్యాప్తు సంస్థలు నీరవ్ మోదీని దేశానికి రప్పించడానికి, నిధులను రికవరీ చేయడానికి ప్రయత్నిస్తున్న తరుణంలో లండన్ కోర్టు తీర్పు బ్యాంకులకు భారీ ఊరటనిచ్చింది.