న్యూఢిల్లీ, జూన్ 4 : ఎప్పుడూ ఒకే చోట ఉండని నగరాన్ని ఊహించుకోండి. భూమిపై నిర్మించడానికి బదులుగా అంతర్జాతీయ సముద్ర జలాలపై తేలుతూ వేలాదిమంది నివాసులకు వసతితోపాటు పాఠశాలలు, రెస్టారెంట్లు, దవాఖానలు, స్టేడియంను కూడా సమకూర్చే ఒక చిన్నపాటి పట్టణాన్ని ఊహించుకోండి. ఫ్రీడమ్ షిప్ అనే బృహత్ ప్రణాళిక వెనుక ఉన్న దార్శనికత అదే. ఇది కార్యరూపం దాలిస్తే చరిత్రలో ఇంత భారీ నౌక నిర్మాణం జరగడం ఇదే మొదటిసారి అవుతుంది. దాదాపు 1600 కోట్ల డాలర్ల(రూ.1.53 లక్షల కోట్లు) వ్యయం కాగలదని అంచనా వేసిన ఈ ఫ్రీడమ్ షిప్ సుమారు 80,000 మందికి వసతి సమకూర్చగలదు. ప్రధానంగా అంతర్జాతీయ జలాలపైనే తిరగగల భారీ నౌక నిర్మాణం ఇంకా ప్రారంభం కానప్పటికీ అత్యంత అసాధారణ పట్టణ ప్రాజెక్టులో ఒకటిగా ఈ ప్రతిపాదన అందరి దృష్టిని ఆకట్టుకుంటున్నది. సంప్రదాయ విహార నౌకకు బదులుగా అత్యంత విశాలమైన తేలియాడే నగరాన్ని నిర్మించాలనే భావనతో 1990 దశకంలో ఈ ప్రతిపాదన మొదటిసారి బయటకువచ్చింది.
ఈ ప్రాజెక్టు ముఖ్య లక్ష్యం స్వయం సమృద్ధి గల సమాజాన్ని నిర్మించడం. గమ్యస్థానానికి చేర్చే విహార నౌకల తరహాలో ఇది ఉండదు. శాశ్వత నివాసంగా ఫ్రీడమ్ షిప్ పనిచేస్తుంది. ఇందులో నివసించే వారు పనిచేసుకోవడం, చదువుకోవడం, విశ్రాంతి తీసుకోవడం వంటి సాధారణ దైనందిన జీవితాన్ని ఇందులోనే సాగించవచ్చు. ప్రతిపాదనల ప్రకారం ఈ నౌక పొడవు 1.6 కిలోమీటర్లు ఉంటుంది. డజన్ల సంఖ్యలో డెక్కులు ఉంటాయి. నివాస ప్రాంతాలు, వాణిజ్య ప్రాంతాలు, వినోద సదుపాయాల వంటివి ప్రత్యేకంగా నిర్మిస్తారు. ఈ నౌకపైన 50,000 మంది శాశ్వత నివాసులు ఉండవచ్చని అంచనా. సందర్శకులు, నౌక సిబ్బంది వంటివారిని కలుపుకుంటే మొత్తం 80,000 మంది వరకు దీనిపైన ఉండవచ్చు. ఇక్కడ నివసించే వారి పిల్లల కోసం స్కూళ్లు, విద్యా సౌకర్యాలు ఉంటాయి. షాపింగ్ సెంటర్లు, బ్యాంకులు, రెస్టారెంట్లు, ఆఫీసు ప్రదేశాలు, దవాఖాన వంటి నగర పౌరులకు అవసరమైన సమస్త సౌకర్యాలు ఫ్రీడమ్ షిప్లో లభిస్తాయి. అంతేగాక 15,000 సీటింగ్ సామర్థ్యంతో ఒక స్టేడియం కూడా ఇందులో ఉంటుంది. పార్కులు, మ్యూజియం, సినిమా థియేటర్లు ఇక్కడ అందుబాటులో ఉంటాయి.

ఈ నౌక పరిమాణం భారీగా ఉన్నందున ఇది ప్రపంచ నగరాల రేవుల సమీపం వరకు వెళ్లలేదు. ఫెర్రీలు, చిన్న పడవలు, హెలికాప్టర్లు వంటివి ఉపయోగించుకుని ఆ రేవులను చేరుకుని ఆయా నగరాలను సందర్శించవచ్చు. అలాగే ఆ నగర పౌరులు ఈ నౌకను సందర్శించవచ్చు.అయితే నిధులు సమకూర్చుకోవడమే ఈ ఫ్రీడమ్ షిప్ ముందున్న ప్రధాన సవాలు. ఇంతటి భారీ ప్రైవేట్ పెట్టుబడిదారుడు ముందుకురావడం లేదు. నిధులుఉంటే దీని నిర్మాణాన్ని మూడు, నాలుగేండ్లలో పూర్తిచేయడం సాధ్యమేనని ప్రాజెక్టు మద్దతుదారులు చెబుతున్నారు. ఈ ప్రాజెక్టు కార్యరూపం దాలుస్తుందో లేదో ఎవరూ చెప్పలేనప్పటికీ చరిత్రలోనే అత్యంత ప్రతిష్టాత్మక సముద్రంపై తేలియాడే నగరాన్ని నిర్మించవచ్చనే ఊహే గొప్పగా ఉంటుంది.