Soil collapse : ఇంటి గోడలకు పూసేందుకు బంకమట్టి కోసం పోయిన మహిళలు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. మట్టిని సేకరిస్తుండగా ఒక్కసారిగా మట్టిదిబ్బ కుప్పకూలి మీద పడటంతో నలుగురు మహిళలు (Four women) మరణించారు. మరో ఐదుగురు మహిళలకు గాయాలయ్యాయి. ఉత్తరప్రదేశ్ (Uttarpradesh) రాష్ట్రం కాస్గంజ్ (Kasganj) జిల్లాలోని మోహన్పురా (Mohanpura) గ్రామంలో మంగళవారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది.
మోహన్పురా గ్రామానికి చెందిన కొందరు మహిళలు ఇంటి గోడలకు పూసేందుకు బంకమట్టి కోసం ఆ గ్రామ శివార్లలోని బాయి ఒడ్డున ఉన్న మట్టిదిబ్బ దగ్గరికి వెళ్లారు. అక్కడ మట్టిని సేకరిస్తుండగా ఒక్కసారిగా మట్టిదిబ్బ కుప్పకూలి మహిళల మీదపడింది. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు, స్థానిక అధికారులు హుటాహుటిన ఘటనా ప్రాంతానికి వెళ్లి సహాయక చర్యలు చేపట్టారు.
మట్టిని తొలగించి మొత్తం 9 మంది మహిళలను బయటికి తీశారు. వారిని వెంటనే చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. వారిలో నలుగురు మహిళలు ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు తెలిపారు. గాయాలతో ఉన్న మిగతా ఐదుగురికి చికిత్స అందిస్తున్నారు. మట్టిదిబ్బ నిర్లక్ష్యంగా వదిలేసి నలుగురి మృతికి కారణమైన వారిపై చర్యలు తీసుకుంటామని కాస్గంజ్ జిల్లా కలెక్టర్ తెలిపారు. ఘటనపై యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్ విచారం వ్యక్తం చేశారు.