న్యూఢిల్లీ, నవంబర్ 19 : బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్‌లో మరో ఘోరం చోటుచేసుకుంది. ఓ 28 ఏళ్ల మహిళను నలుగురు వ్యక్తులు కిడ్నాప్ చేసి, మత్తుమందిచ్చి, సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అలీగఢ్‌తోపాటు ఇతర ప్రదేశాలలో 48 రోజులపాటు తనను బంధించి సామూహిక అత్యాచారానికి పాల్పడినట్లు బాధిత మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అంతేగాక తన ఫిర్యాదును నమోదు చేయాలని పోలీసులను ఆశ్రయించిన ఆమెపై ఇద్దరు సబ్ ఇన్స్పెక్టర్లు సైతం అత్యాచారానికి పాల్పడ్డారు. బులంద్‌షహర్‌లోని ఖురియా పోలీసు స్టేషన్లో పనిచేసే ఇద్దరు సబ్ ఇన్స్పెక్టర్లపై సస్పెన్షన్ వేటు వేసిన అధికారులు వీరిపై దర్యాప్తునకు ఆదేశించారు.
తన ఫిర్యాదుపై చర్యలు తీసుకునేందుకు రూ. 50,000 తన నుంచి వసూలు చేసిన ఇద్దరు ఎస్ఐలు తమ డిమాండ్లకు అంగీకరించకపోతే తన భర్తపై తప్పుడు కేసు నమోదు చేస్తామని బెదిరించారని ఆమె ఫిర్యాదు చేసింది. ఈ కేసులో ప్రధాన నిందితుడిని పోలీసులు అరెస్టు చేసి జైలుకు తరలించారు. కాగా, ఈ ఘటనపై తనకు తానుగా స్పందించిన జాతీయ మహిళా కమిషన్ చైర్పర్సన్ విజయా రహత్కర్ పోలీసు అధికారులతోసహా నిందితులందరిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశిస్తూ ఉత్తర్ ప్రదేశ్ డీజీపీకి లేఖ రాశారు. గత నవంబర్‌లో నలుగురు వ్యక్తులు తనను కిడ్నాప్ చేసి ఉత్తరప్రదేశ్‌లోని వేర్వేరు ప్రదేశాలకు తరలించారని బాధిత మహిళ తన ఫిర్యాదులో పేర్కొంది. తనకు మత్తు మందిచ్చి సామూహిక అత్యాచారానికి పాల్పడడంతోపాటు తనకు బలవంతంగా మతం మార్పిడి చేశారని ఆమె ఆరోపించింది.
న్యాయం కోసం పోలీసు స్టేషన్‌కు వెళ్లిన తనను ఓ ఎస్ఐ తన ఇంటికి రప్పించుకుని రెండు రోజులపాటు అత్యాచారానికి పాల్పడ్డాడని ఆమె ఆరోపించింది. మరో ఎస్ఐ తన నుంచి రూ. 50,000 వసూలు చేశాడని తెలిపింది. తన ఫిర్యాదుపై ఎఫ్ఐఆర్ నమోదు చేయడంలో పోలీసులు ఆలస్యం చేయడంతో నిందితులలో పలుకుబడి కల ఒకడు తనను, తన కుటుంబాన్ని బెదిరించినట్లు ఆమె పేర్కొంది. కాగా, ఇద్దరు పోలీసు అధికారులపై బాధిత మహిళ చేసిన ఆరోపణలు చాలా తీవ్రమైనవని, వెంటనే వారిద్దరినీ సస్పెండ్ చేశామని బులంద్‌షహర్ ఎస్ఎస్పీ దినేశ్ కుమార్ తెలిపారు.