Madhya Pradesh : మధ్యప్రదేశ్లో ఘోర ప్రమాదం జరిగింది. ఒక క్రూయిజ్ పడవ బోల్తా పడిన ఘటనలో నలుగురు మరణించారు. పలువురు గల్లంతయ్యారు. ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ఘటన మధ్యప్రదేశ్, జబల్పూర్ జిల్లాలోని ఖమారియా ఐలాండ్ సమీపంలోని బర్గి డ్యామ్ వద్ద గురువారం సాయంత్రం జరిగింది.
ప్రాథమిక సమాచారం ప్రకారం.. 35 నుంచి 40 మంది ప్రయాణికులతో కూడిన ఒక క్రూయిజ్ బోటు నదిలో ప్రయాణిస్తుండగా, వేగంగా వీచిన అలల ధాటికి అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ఘటనలో ఇప్పటివరకు నలుగురు మరణించారు. మరికొందరు గల్లంతయ్యారు. ఘటన గురించి సమాచారం అందుకున్న స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్ (ఎస్డీఆర్ఎఫ్) బృందాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. బాధితుల్ని రక్షించేందుకు సహాయక చర్యలు ప్రారంభించాయి. ఈ క్రమంలో ఇప్పటివరకు 18 మందిని రక్షించినట్లు తెలుస్తోంది.
మిగతావారిని కూడా రక్షించేందుకు ప్రయత్నిస్తున్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇంకొందరు గల్లంతు కాగా, వారి కోసం కూడా బృందాలు వెతుకుతున్నాయి. 15 నుంచి 18 మంది గల్లంతైసనట్లు బర్గి టౌన్ ఎస్పీ అంజుల్ మిశ్రా వెల్లడించారు. నలుగురి మృతదేహాల్ని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. జబల్పూర్ జిల్లా కలెక్టర్ సమీర్.. ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఘటనపై మరింత సమాచారం రావాల్సి ఉంది.