తిరువనంతపురం: కశ్మీర్ టూరుకు వెళ్లిన కేరళ ఎమ్మెల్యేలు, జడ్జీలు క్షేమంగా ఉన్నట్లు సీఎం పినరయి విజయన్(Pinarayi Vijayan) వెల్లడించారు. కశ్మీర్లో ఉన్నకేరళ పర్యాటకుల్ని సురక్షితంగా స్వరాష్ట్రానికి తీసుకువచ్చేందుకు ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. కేరళ హైకోర్టు జడ్జీలు జస్టిస్ అనిల్ కే నరేంద్రన్, జస్టిస్ పీజీ అజిత్‌కుమార్, జస్టిస్ గిరీశ్.. ప్రస్తుతం జమ్మూకశ్మీర్ టూరులో ఉన్నారు. ఆ జడ్జీలు శ్రీనగర్‌లో ఉన్న ఓ హోటల్లో క్షేమంగా ఉన్నట్లు సీఎం తెలిపారు. గురువారం వాళ్లు స్వరాష్ట్రానికి తిరిగి వెళ్లనున్నారు.
ఎమ్మెల్యేలు ఎం ముకేశ్, కేపీనీ మజీద్, టీ సిద్దిక్, కే అన్సలన్ కూడా శ్రీనగర్‌లోనే ఉన్నారు. వాళ్లు కూడా క్షేమంగా ఉన్నట్లు కేరళ సీఎం చెప్పారు. కేరళ పర్యాటకుల కోసం నోర్కా గ్లోబల్ కాంటాక్ట్ సెంటర్‌ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. టోల్ ఫ్రీ నెంబర్లను కూడా రిలీజ్ చేశారు. కేరళలోని కొచ్చికి చెందిన రాంచంద్రన్ అనే వ్యక్తి పెహల్గామ్ దాడిలో ప్రాణాలు కోల్పోయాడు. తన కూతురు, మనవళ్లతో కలిసి రాంచంద్రన్ కశ్మీర్ టూరుకు వెళ్లారు. అయితే ఉగ్రదాడి సమయంలో సాయుధులు అతన్ని కాల్చి చంపారు. ప్రస్తుతం కూతురు ఆరతి, ఆమె పిల్లలు అక్కడే ఉన్నారు.