లక్నో : ఎక్స్‌ప్రెస్ వేలు ప్రమాదాలకు నిలయాలుగా మారుతున్నాయి. ఆగ్రా-లక్నో ఎక్స్‌ప్రెస్ వేపై ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఇటావా జిల్లాలోని ఎక్స్‌ప్రెస్ హైవేపై స్లీపర్ బస్ ఓ ట్రక్‌ను ఢీకొనడంతో నలుగురు మరణించగా 42 మందికి తీవ్ర గాయాలయ్యాయి.
క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించిన అధికారులు ఘటనపై దర్యాప్తు చేపట్టారు. 46 మంది ప్రయాణీకులతో స్లీపర్ బస్ గోరఖ్‌పూర్ నుంచి అజ్మీర్ షరీఫ్‌కు బయలుదేరంగా ఎక్స్‌ప్రెస్ వేపై సఫై సమీపంలో బస్ డ్రైవర్ నిద్ర మత్తులో వాహనంపై అదుపు తప్పాడు.
దీంతో బస్ ఎదురుగా వస్తున్న ఇసుక ట్రక్‌ను ఢీ కొంది. ఘటన సమాచారం స్ధానికులు చేరవేయడంతో అక్కడకు చేరుకున్న అధికారులు గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. ఇటావా డీఎం అవనీష్ కుమార్ రాయ్, ఎస్ఎస్పీ జైప్రకాష్ సింగ్ ఇతర అధికారులు ఘటనా స్ధలానికి చేరుకుని సహాయ కార్యక్రమాలు పర్యవేక్షించారు.