కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలోని ఆర్జీ కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్లో అత్యాచారం, హత్యకు గురైన 31 ఏళ్ల వైద్యురాలి నలుగురు సహోద్యోగుల వాంగ్మూలం పరస్పరం విరుద్ధంగా ఉన్నట్లు సీబీఐ గుర్తించింది. (Kolkata Hospital) ఈ నేపథ్యంలో మాజీ ప్రిన్సిపాల్‌తోపాటు ఈ నలుగురికి లై డిటెక్టర్ టెస్ట్ కోసం కోర్టు అనుమతి పొందింది. బాధిత వైద్యురాలు హత్యాచారానికి గురైన రాత్రి ఇద్దరు మొదటి సంవత్సరం పోస్ట్ గ్రాడ్యుయేట్ ట్రైనీలు, హౌస్ సర్జన్, ఇంటర్న్ డాక్టర్ ఆమెతో కలిసి ఉన్నారు. వారంతా కలిసి భోజనం చేశారు.
కాగా, వైద్యురాలి మృతదేహాన్ని గుర్తించిన మూడో అంతస్తులోని సెమినార్ గదిలో ఈ నలుగురు వైద్యుల్లో ఇద్దరి వేలిముద్రలను సీబీఐ అధికారులు గుర్తించారు. ఆ రాత్రి వేళ మొదటి అంతస్తు నుంచి మూడో అంతస్తుకు హౌస్ సర్జన్ వెళ్లడాన్ని సీసీటీవీ ఫుటేజ్ ద్వారా గమనించారు. రాత్రి 2.45 గంటలకు మూడో అంతస్తుకు తాను వెళ్లినట్లు సీబీఐ అధికారులకు హౌస్ సర్జన్ చెప్పాడు. అలాగే మూడో అంతస్తులో ఉన్న ఇంటర్న్ డాక్టర్ ఆ రోజు రాత్రి బాధితురాలితో ఫోన్లో మాట్లాడినట్లు సీబీఐ అధికారులు తెలుసుకున్నారు.
మరోవైపు ఆ రోజు రాత్రి బాధిత వైద్యురాలితో పాటు కలిసి ఉన్న నలుగురు సహచర డాక్టర్ల వాంగ్మూలం పరస్పరం విరుద్ధంగా ఉన్నట్లు సీబీఐ గుర్తించింది. ఈ నలుగురు వైద్యులు నేరంలో పాల్గొన్నట్లు కనిపించడం లేదని పేర్కొంది. అయితే సాక్ష్యాలను తారుమారు చేయడంలో వారి పాత్ర ఉన్నదా? వైద్యురాలి హత్యాచార కుట్రలో వారి ప్రమేయం ఉన్నదా? అన్నది మరింతగా తెలుసుకోవాలని సీబీఐ భావిస్తున్నది. ఈ నేపథ్యంలో మాజీ ప్రిన్సిపాల్ డాక్టర్ సందీప్ ఘోష్‌తో పాటు ఈ నలుగురు జూనియర్ డాక్టర్లకు పాలిగ్రాఫ్ టెస్ట్ కోసం కోల్‌కతా హైకోర్టు అనుమతిని సీబీఐ పొందింది. ఈ కేసులో నిందితుడిగా అనుమానించి అరెస్ట్ చేసిన వాలంటీర్ సంజయ్ రాయ్‌కు కూడా లై డిటెక్టర్ టెస్ట్ నిర్వహించేందుకు సీబీఐకి కోర్టు అనుమతి ఇచ్చింది.