న్యూఢిల్లీ, అక్టోబర్ 3: ప్రముఖ ఆన్లైన్ న్యూస్ పోర్టల్ న్యూస్‌క్లిక్ సంస్థపై ఢిల్లీ పోలీసులు ఉక్కుపాదం మోపారు. సంస్థ కార్యాలయం, జర్నలిస్టుల ఇండ్లలో మంగళవారం ఉదయం నుంచి సోదాలు చేపట్టారు. అనంతరం సంస్థ కార్యాలయాన్ని సీజ్ చేశారు. సంస్థ వ్యవస్థాపకుడు ప్రబీర్ పుర్కాయస్థను అరెస్ట్ చేశారు. ఆయనతోపాటు సంస్థ హెచ్ఆర్ హెడ్ అమిత్ చక్రవర్తిని అదుపులోకి తీసుకున్నారు. చైనాకు అనుకూలంగా వ్యవహరిస్తూ ఆ దేశం నుంచి నిధులు స్వీకరించినట్టు వచ్చిన ఆరోపణల నేపథ్యంలో పోలీసులు ఉగ్రవాద వ్యతిరేక చట్టం (యూఏపీఏ) కింద న్యూస్‌క్లిక్‌పై కేసు నమోదు చేశారు. ఇందులో భాగంగానే సోదాలు జరిపారు.
5 నగరాలు.. 100 ప్రాంతాలు.. 500 మంది పోలీసులు
దాడుల విషయాన్ని రహస్యంగా ఉంచారు. ఉదయం 2 గంటల సమయంలో స్పెషల్ సెల్ పోలీసులు లోధీ కాలనీలోని కార్యాలయంలో సమావేశమయ్యారు. విషయం లీక్ కాకుండా ఉండేందుకు సీనియర్ స్థాయి అధికారులు మినహా.. జూనియర్ అధికారుల ఫోన్లను ఆఫీసులోనే ఉంచినట్టు సమాచారం. ఢిల్లీ, నోయిడా, ఘజియాబాద్, ముంబై, గురుగ్రామ్ నగరాల్లో దాదాపు 100 ప్రాంతాల్లో సుమారు 500 మంది పోలీసులు తనిఖీల్లో పాల్గొన్నారు. నోయిడా ఎక్స్‌టెన్షన్‌లోని జర్నలిస్టు అభిసర్ శర్మ ఇంట్లో సోదాలు జరిపిన పోలీసులు సెల్‌ఫోన్, ల్యాప్‌టాప్, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను సీజ్ చేశారు. అభిసర్ శర్మను ప్రశ్నించడానికి తీసుకెళ్లారు.
జర్నలిస్టు ఉర్మిలేశ్ను కూడా స్పెషల్ సెల్ కార్యాలయానికి తీసుకెళ్లారు. విదేశీ పర్యటనలు, షాహీన్‌బాగ్, రైతుల నిరసనలు తదితర వాటికి సంబంధించి దాదాపు 25 ప్రశ్నలను వీరిని అడిగినట్టు సమాచారం. వీరితోపాటు జర్నలిస్టులు అనునిన్ద్యో చక్రవర్తి, పరంజాయ్ గుహ థాకుర్తా తదితరులను కూడా ప్రశ్నించారు. నిధుల ఆరోపణలపై గతంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సోదాలు చేపట్టిందని అధికారులు చెప్పారు. ఆ సంస్థ ఇచ్చిన సమాచారం మేరకు తాజాగా తాము సోదాలు జరిపామని తెలిపారు. కేంద్ర సమాచార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ స్పందిస్తూ కేంద్ర దర్యాప్తు సంస్థలు స్వతంత్రమైనవని, అవి చట్ట ప్రకారం తమ పని తాము చేసుకుంటూ పోతాయని పేర్కొన్నారు.
ఏచూరి నివాసంలోనూ
ఢిల్లీలో సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి నివాసంలోనూ సోదాలు జరిగాయి. ఆయన సిబ్బందిలో ఒకరైన శ్రీనారయణ్ కుమారుడు సుమిత్ న్యూస్‌క్లిక్‌లో పనిచేస్తున్నారు. ముంబైలో సామాజిక కార్యకర్త తీస్తా సెతల్వాద్ నివాసంలోనూ తనిఖీలు చేపట్టారు.
మీడియా గొంతు నొక్కడమే
సోదాలను ప్రెస్ క్లబ్ ఆఫ్ ఇండియా, జర్నలిస్టు సంఘాలు, రాజకీయ పార్టీలు తీవ్రంగా ఖండించాయి. ఇది మీడియా గొంతు నొక్కడమేనని జర్నలిస్టు సంఘాలు విమర్శించాయి. ప్రతిపక్ష ఇండియా కూటమి స్పందిస్తూ నిజం మాట్లాడేవారిపై ఇలాంటి దాడులు జరుగుతున్నాయని, ద్వేషం, విభజనను వ్యాప్తి చేసేవారిపై దాడులు జరుగడం లేదని తెలిపింది. రానున్న ఎన్నికల్లో బీజేపీ ఓటమికి ఈ సోదాలే నిదర్శనమని ఎస్పీ అధినేత అఖిలేశ్ యాదవ్ విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం తమకు అనుకూలంగా ఉన్న మీడియా సంస్థలకు కోట్ల రూపాయల ప్రకటనలు ఇస్తున్నదని, దీనిపై ఎందుకు స్పందించరని నిలదీశారు. జర్నలిస్టులంటే బీజేపీకి భయమని, అందుకే ఇలాంటి సోదాలు జరుపుతున్నదని ఆప్ ధ్వజమెత్తింది.