లక్నో: ఇటీవల పదవికి రాజీనామా చేసిన యూపీ రాష్ట్ర మాజీ మంత్రి దారాసింగ్ చౌహాన్ ఇవాళ సమాజ్‌వాది పార్టీలో చేరారు. యూపీ రాజధాని లక్నోలో జరిగిన ఓ కార్యక్రమంలో ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ సమక్షంలో దారాసింగ్ ఆ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా అఖిలేష్ యాదవ్ మాట్లాడుతూ.. బీజేపీపై, ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్‌పై విమర్శలు చేశారు.
వెనుకబడిన కులాల వాళ్లు, దళితులు బీజేపీ తీరును అర్థం చేసుకున్నారని, దేశంలోని ప్రతి ఒక్క ప్రభుత్వరంగ సంస్థను ప్రవేటీకరించేందుకు మోదీ ప్రభుత్వం పావులు కదుపుతున్నదనే విషయాన్ని వారు పసిగట్టారని అఖిలేష్ యాదవ్ చెప్పారు. తర్వాత అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని కూడా రద్దు చేసి రిజర్వేషన్ విధానానికి స్వస్తి చెబుతారని అఖిలేష్ ఆరోపించారు.
ఇక, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్‌పై కూడా అఖిలేష్ యాదవ్ విమర్శలు గుప్పించారు. యోగీ ఆదిత్యనాథ్ చెప్పినన్ని అబద్దాలు మరే ముఖ్యమంత్రి చెప్పలేదని, ఆయనో అబద్దాలకోరు అని అఖిలేష్ యాదవ్ ఆరోపించారు. దారాసింగ్ చౌహాన్‌కు, ఆయనతోపాటు పార్టీలో ఎస్పీలో చేరుతున్న ఆయన మద్దతుదారులకు సాదర స్వాగతం పలుకుతున్నానని చెప్పారు.