న్యూఢిల్లీ, ఆగస్టు 19 : ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఇండియా కూటమి అభ్యర్థిగా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బీ సుదర్శన్ రెడ్డి పేరును కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే మంగళవారం ప్రకటించారు. దేశంలోని రెండవ అత్యున్నత పదవి కోసం సెప్టెంబర్ 9న జరగనున్న ఎన్నికను సైద్ధాంతిక పోరుగా ఖర్గే అభివర్ణించారు. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి అయిన సుదర్శన్ రెడ్డి గోవాకు తొలి లోకాయుక్తగా పనిచేశారు. అంతేగాక హైదరాబాద్‌లోని ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ అండ్ మీడియేషన్ సెంటర్ ట్రస్టీల బోర్డులో కూడా ఆయన ఉన్నారు. నేటి సాయంత్రానికి ఢిల్లీ చేరుకోనున్న సుదర్శన్ రెడ్డి వివిధ ప్రతిపక్ష పార్టీలకు చెందిన నాయకులను కలుసుకోనున్నారు. ఈనెల 21న ఆయన తన నామినేషన్ దాఖలు చేస్తారు. బుధవారం మధ్యాహ్నం సంవిధాన్ సదన్(పాత పార్లమెంట్ భవనం)లోని సెంట్రల్ హాలులో ఉమ్మడి విపక్ష సమావేశం జరగనున్నది. ఉమ్మడి అభ్యర్థిని పోటీలో ఉంచాలని అన్ని విపక్షాలు నిర్ణయించాయని, ఈ నిర్ణయాన్ని ఏకగ్రీవంగా తీసుకున్నాయని ఖర్గే విలేకరుల సమావేశంలో తెలిపారు.
ఒక పేరుపై అన్ని విపక్ష పార్టీలు అంగీకరించడం తనకు సంతోషంగా ఉందని, ఇది ప్రజాస్వామ్యానికి గొప్ప విజయమని ఆయన చెప్పారు. ప్రజాస్వామ్యం, రాజ్యాంగంపై దాడి జరిగినప్పుడల్లా విపక్షాలు ఐక్యమై దాన్ని ఎదుర్కొంటాయని, ఈ ఎన్నికల్లో ఓ మంచి అభ్యర్థిని నిలబెట్టాలని తాము నిర్ణయించామని ఖర్గే తెలిపారు. రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడైన ఖర్గే విపక్ష పార్టీల సంయుక్త ప్రకటనను చదివి వినిపిస్తూ జస్టిస్ సుదర్శన్ రెడ్డి దేశంలోనే అత్యంత లబ్ద్ద ప్రతిష్టులైన ప్రగతిశీల న్యాయకోవిదునిగా అభివర్ణించారు. సుదర్శన్ రెడ్డికి సుదీర్ఘ, గొప్ప న్యాయపరమైన అనుభవం ఉందని, ఆయన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తిగా, గువాహటి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా, సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పనిచేశారని ఖర్గే వివరించారు. సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయం కోసం నిబద్ధతతో, ధైర్యంతో పోరాడుతున్నారని తెలిపారు. ఉప రాష్ట్రపతి ఎన్నిక ఓ సైద్ధాంతిక పోరాటమని, తమ ఉమ్మడి అభ్యర్థిగా సుదర్శన్ రెడ్డిని విపక్ష పార్టీలు నామినేట్ చేశాయని ఖర్గే తెలిపారు. ఆర్ఎస్ఎస్ నేపథ్యం ఉన్న మహారాష్ట్ర గవర్నర్ సీపీ రాధాకృష్ణన్‌ని బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ తమ అభ్యర్థిగా ఇప్పటికే ప్రకటించింది.
ఉప రాష్ట్రపతి ఎన్నికలో తమ ఉమ్మడి అభ్యర్థిగా జస్టిస్(రిటైర్డ్) బీ సుదర్శన్ రెడ్డి పేరును విపక్ష ఇండియా కూటమి ప్రకటించడంతో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏలో ముఖ్యంగా దక్షిణాది భాగస్వామ్య పక్షాలలో ఇబ్బందికర పరిస్థితి ఏర్పడింది. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తిని, దేశంలోని ప్రముఖ న్యాయకోవిదుడిని తమ ఉమ్మడి అభ్యర్థిగా ఇండియా కూటమి ప్రకటించి తాము ఈ ఎన్నికల్లో లాంఛనంగా పోటీ చేయడం లేదన్న సందేశాన్ని ఎన్డీఏకి బలంగా పంపించాయి. లోక్‌సభ, రాజ్యసభలో అధికార ఎన్డీఏ కూటమికి అనుకూలంగా సంఖ్యాబలం స్పష్టంగా కనపడుతున్నప్పటికీ వ్యూహాత్మకంగా తాము ఎంపిక చేసిన అభ్యర్థితో కొన్ని రాజకీయ పార్టీలు పునరాలోచనలో పడే అవకాశం లేకపోలేదని ఇండియా కూటమి అంచనా వేస్తోంది. ఇది సైద్ధాంతక సమరమని డీఎంకే ఎంపీ కనిమొళి అభివర్ణించారు. ఆర్ఎస్ఎస్ నేపథ్యం ఉన్న వ్యక్తికి వ్యతిరేకంగా రాజ్యాంగాన్ని గౌరవించే అభ్యర్థిని తాము ఉమ్మడిగా ఎంపికచేశామని ఆమె పేర్కొన్నారు. అయితే తమిళనాడులోని కోయంబత్తూరు నుంచి రెండుసార్లు ఎంపీగా పనిచేసిన సీపీ రాధాకృష్ణన్‌ని తమ అభ్యర్థిగా ఎన్డీఏ నామినేట్ చేసి ఎంకే స్టాలిన్ నాయకత్వంలోని డీఎంకేలో గందరగోళాన్ని సృష్టించేందుకు ప్రయత్నించింది. తమిళనాడులో తమిళుల ఆత్మగౌరవం అన్నది చాలా భావోద్వేగాలతో ముడిపడిన అంశం కావడంతో స్థానిక సెంటిమెంటుకు, జాతీయ రాజకీయ లెక్కలకు మధ్య గీత గీయాల్సిన పరిస్థితి డీఎంకేకి ఏర్పడింది. విపక్షాల ఉమ్మడి అభ్యర్థికే తమ మద్దతని ప్రకటించిన డీఎంకే తమ నిర్ణయాన్ని రాజకీయంగా నిర్వచించాలే తప్ప భాషాపరంగా లేక ప్రాంతీయ ఆత్మగౌరవంతోనో చూడకూదని పేర్కొంది. ఇక ఆంధ్రప్రదేశ్‌లో ఎన్డీఏ భాగస్వామ్యపక్షమైన చంద్రబాబు నాయుడు సారథ్యంలోని తెలుగుదేశం పార్టీ కూడా ఇదే సంకట స్థితిలో పడింది. రాధాకృష్ణన్ అభ్యర్థిత్వాన్ని చంద్రబాబు లాంఛనంగా స్వాగతించగా ఆయన కుమారుడు, రాష్ట్ర మంత్రి నారా లోకేశ్ ఢిల్లీలో ఎన్డీఏ అభ్యర్థిని నేరుగా కలుసుకుని అభినందించారు.
అయితే 1980, 1990 దశకాలలో న్యాయవాదిగా సుదర్శన్ రెడ్డి పనిచేసిన కాలంలో ఎన్టీ రామారావు నేతృత్వంలోని తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంతో సన్నిహితంగా ఉన్నారు. అనేక యూనివర్సిటీలకు ప్రాతినిధ్యం వహించడమేగాక టీడీపీ న్యాయ వ్యవహారాలను ఆయన చూసుకున్నారు. ఆ కాలంలో ఆయనకు చంద్రబాబుతో మంచి అనుబంధం ఉంది. తమ పార్టీతో చారిత్రక అనుబంధం ఉన్న సుదర్శన్ రెడ్డిని ఇండియా కూటమి అభ్యర్థిగా బరిలోకి దించడంతో చంద్రబాబుకు ఎటూ తేల్చుకోలేని స్థితి ఏర్పడింది. అయితే ఎన్డీఏ అభ్యర్థికి మద్దతిచ్చే విషయంలో తమకు ఎటువంటి అస్పష్టత లేదని టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ స్పష్టత ఇచ్చారు. ఎన్డీఏ ఐక్యంగా ఉందని ఆయన తెలిపారు. నలుగురు రాజ్యసభ సభ్యులున్న భారత రాష్ట్ర సమితి(బీఆర్ఎస్) ఉప రాష్ట్రపతి అభ్యర్థిపై తన వైఖరిని ఇంకా నిర్ణయించలేదు. బీఆర్ఎస్ ఎంపీ కేఆర్ సురేశ్ రెడ్డి ఇండియా టుడేతో మాట్లాడుతూ జాతీయ ప్రయోజనాలకు సంబంధించిన అంశాలలో తమ పార్టీ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చినప్పటికీ ఈ ఎన్నికలో ఎవరికి మద్దతు ఇవ్వాలన్న అంశంపై పార్టీ అధ్యక్షుడు కే చంద్రశేఖర్ రావు నిర్ణయం తీసుకుంటారని తెలిపారు. ఇక వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోని వైఎస్ఆర్సీపీ తాను ఎన్డీఏ అభ్యర్థికే మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించింది. తమ అభ్యర్థికి మద్దతు ఇవ్వాలన్న ఇండియా కూటమి అభ్యర్థనను ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి తిరస్కరించారు. తాము ఎన్డీఏ అభ్యర్థికే మద్దతు ఇవ్వనున్నట్లు తెలిపారు. రాజ్‌నాథ్ సింగ్ తమను సంప్రదించారని, ఎన్డీఏ అభ్యర్థికి మద్దతు ఇస్తామని ఆయనకు మాట ఇచ్చామని సుబ్బారెడ్డి చెప్పారు. ఒడిశాకు చెందిన బిజూ జనతా దళ్(బీజేడీ) ఉప రాష్ట్రపతి ఎన్నికలలో తమ వైఖరిపై ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. మద్దతు కోసం నవీన్ పట్నాయక్ పార్టీని ఇండియా కూటమి నాయకులు ఇప్పటివరకు సంప్రదించలేదని సంబంధిత వర్గాలు తెలిపాయి.
న్యూఢిల్లీ: వచ్చే నెల 9న జరగనున్న ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఇండియా కూటమి అభ్యర్థిగా ఎంపికైన సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి బీ సుదర్శన్ రెడ్డి స్వస్థలం తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలంలోని ఆకులమైలారం గ్రామం. 1946 జూలై 8న ఓ రైతు కుటుంబంలో జన్మించిన సుదర్శన్ రెడ్డి ఉస్మానియా యూనివర్సిటీలో న్యాయ విద్య అభ్యసించారు. 1971 డిసెంబర్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో న్యాయవాదిగా వృత్తి జీవితాన్ని ప్రారంభించి 1989లో ప్రభుత్వ న్యాయవాదిగా నియమితులయ్యారు.
1990 కేంద్ర ప్రభుత్వ అదనపు స్టాండింగ్ కౌన్సెల్‌గా కొద్దికాలం పనిచేశారు. ఉస్మానియా యూనివర్సిటీకి న్యాయ సలహాదారుగా, స్టాండింగ్ కౌన్సెల్‌గా కూడా ఆయన పనిచేశారు. 1993లో హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమితులై 1995 మేలో అదే హైకోర్టుకు శాశ్వత న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2005 డిసెంబర్లో గౌహతి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. 2007 జనవరి 12న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు.