Parkash singh Badal | మొహాలీ, ఏప్రిల్ 25: పంజాబ్ మాజీ సీఎం ప్రకాశ్ సింగ్ బాదల్(95) మంగళవారం మొహాలీలో కన్ను మూశారు. వారం క్రితం ఆయన శ్వాసకోశ ఇబ్బందులతో దవాఖానాలో చేరారు. అక్కడే చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. పంజాబ్ రాష్ర్టానికి అతి పిన్న వయస్సులో సీఎంగా రికార్డు ఆయనదే. ఆయన ఏకంగా అయిదు పర్యాయాలు పంజాబ్ సీఎంగా పని చేశారు. ఆకాలీదళ్ పార్టీకి సుదీర్ఘ కాలం అధ్యక్షుడిగా సేవలందించారు. 20 ఏండ్ల వయస్సులో సర్పంచ్‌గా రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన బాదల్, 1957లో మొదటిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1973లో 43 ఏండ్ల వయస్సులో మొదటిసారి పంజాబ్ సీఎం అయ్యారు. 1977లో జనతా పార్టీ ప్రభుత్వంలో స్వల్ప కాలం కేంద్ర వ్యవసాయ, నీటి పారుదల శాఖ మంత్రిగా పని చేశారు. బీజేపీ ప్రభుత్వం తెచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను వ్యతిరేకించిన బాదల్ అందుకు నిరసనగా 2015లో కేంద్రం తనకు ఇచ్చిన పద్మ విభూషణ్ను 2022లో తిరిగి ఇచ్చేశారు.
సీఎం కేసీఆర్ సంతాపం
పంజాబ్ మాజీ సీఎం ప్రకాశ్ సింగ్ బాదల్ మృతి పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ సంతాపం ప్రకటించారు. సర్పంచ్ నుంచి కేంద్రమంత్రిగా, పంజాబ్ సీఎంగా పనిచేసిన బాదల్ ఆ రాష్ట్ర అభివృద్ధి కోసం ఎనలేని కృషి చేశారని అన్నారు. బాదల్ కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.