బెంగుళూరు: కావేరి నదిపై ఉన్న రిజర్వాయర్ల గురించి అధ్యయనం చేపట్టేందుకు ప్రత్యేకమైన, వ్యక్తిగతమైన ఏజెన్సీని ఏర్పాటు చేయాలని ప్రధాని మోదీని మాజీ ప్రధాని దేవగౌడ(Devegowda) కోరారు. ఇవాళ బెంగుళూరులో ఆయన మీడియాతూ మాట్లాడుతూ భావోద్వేగానికి లోనయ్యారు. నీటి ఎద్దడితో సతమతం అవుతున్న అన్ని రాష్ట్రాలకు అమోద్యయోగ్యమైన సరైన విధానాన్ని అమలు చేయాలని వేడుకున్నారు. కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ.. కావేరి నదీపై ఉన్న జలాశయాల గురించి స్టడీ చేయాలని ఆయన సూచించారు. ప్రస్తుతం కర్నాటకలో ఉన్న నీటి పరిస్థితి గురించి కేంద్ర సంస్థ విచారణ చేపట్టాలన్నారు. రాజకీయాల కోసమో, అధికారం కోసమో తాను సజీవంగా లేనని, రాష్ట్ర ప్రజల్ని రక్షించుకునేందుకు తాము ఉన్నామని దేవగౌడ తెలిపారు.
నైరుతీ రుతుపవనాలు విఫలం కావడం వల్ల.. కావేరి నదీపై ఉన్న నాలుగు రిజర్వాయర్లలో నీటి సామర్థ్యం చాలా తక్కువగా ఉన్నట్లు ఆయన చెప్పారు. వ్యవసాయానికి కానీ, తాగేందుకు కానీ నీరును అందించలేని స్థితిలో కర్నాటక ప్రభుత్వం ఉందన్నారు. కావేరి నది జలాల పంపకం విషయంలో తమిళనాడు, కర్నాటక మధ్య ఉన్న విభేదాలను పరిష్కరించాలని కోరుతూ సెప్టెంబర్ 23వ తేదీన ప్రధాని మోదీకి రాసిన లేఖను ఆయన రిలీజ్ చేశారు. నాలుగు రిజర్వాయర్లలో కేవలం 51 టీఎంసీల నీరు మాత్రమే ప్రస్తుతం అందుబాటులో ఉందన్నారు. కానీ ప్రస్తుతం 115 టీఎంసీల నీరు అవసరం ఉందన్నారు.