న్యూఢిల్లీ, ఏప్రిల్ 25 : భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మాజీ చైర్మన్ డాక్టర్ కృష్ణస్వామి కస్తూరి రంగన్ (84) కన్నుమూశారు. గత కొన్ని నెలల నుంచి వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆయన శుక్రవారం ఉదయం బెంగళూరులోని తన నివాసంలో తుదిశ్వాస విడిచినట్టు కుటుంబసభ్యులు వెల్లడించారు. కస్తూరి రంగన్‌కు ఇద్దరు కుమారులు ఉన్నారు. అంతిమ నివాళులర్పించేందుకు ఆయన భౌతిక కాయాన్ని ఈ నెల 27న రామన్ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్ లో ఉంచనున్నట్టు అధికారులు తెలిపారు. కస్తూరి రంగన్ మరణం పట్ల రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోదీ తీవ్ర విచారాన్ని వ్యక్తం చేశారు.
కేరళలోని ఎర్నాకుళంలో సీఎం కృష్ణస్వామి, విశాలాక్షి దంపతులకు 1940 అక్టోబర్ 24న జన్మించిన కస్తూరి రంగన్‌కు తమిళనాడు మూలాలు ఉన్నాయి. ఆయన కుటుంబం త్రిసూర్ జిల్లాలోని చలకుడిలో స్థిరపడింది. కస్తూరి రంగన్ తల్లి పాలక్కడ్ అయ్యర్ కుటుంబానికి చెందినవారు. 1990 నుంచి 1994 వరకు యూఆర్ఏసీ డైరెక్టర్‌గా పనిచేసిన డాక్టర్ కస్తూరి రంగన్.. ఆ తర్వాత 1994 నుంచి 2003 వరకు 9 ఏండ్లపాటు ఇస్రో చైర్మన్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. ఆయన హయాంలోనే ఇస్రో తొలి లూనార్ మిషన్ దిశగా అడుగులు వేసింది. 2003-2009 వరకు రాజ్యసభ సభ్యునిగా, ప్రణాళికా సంఘం సభ్యునిగా సేవలందించిన డాక్టర్ రంగన్.. నూతన జాతీయ విద్యా విధాన ముసాయిదా కమిటీ చైర్‌పర్సన్‌గా, జవహర్లాల్ నెహ్రూ వర్సిటీ చాన్సలర్‌గా, కర్ణాటక నాలెడ్జ్ కమిషన్ చైర్మన్‌గా, బెంగళూరులోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ స్టడీస్ డైరెక్టర్‌గానూ పనిచేశారు. రంగన్ సేవలకు గుర్తింపుగా కేంద్రం 2000 సంవత్సరంలో ఆయనను ‘పద్మ విభూషణ్’ అవార్డుతో సత్కరించింది.