చండీగఢ్: రూ.15 లక్షల డబ్బు ప్యాకెట్ కేసులో పంజాబ్, హర్యానా హైకోర్టు మాజీ న్యాయమూర్తి నిర్మల్ యాదవ్ నిర్దోషిగా తేలారు. చండీగఢ్‌లోని సీబీఐ ప్రత్యేక కోర్టు శనివారం ఈ మేరకు తీర్పు చెప్పింది. కేసు వివరాల్లోకి వెళితే.. 2008 ఆగస్టు 13న అప్పటి పంజాబ్, హర్యానా హైకోర్టు న్యాయమూర్తి నిర్మల్జిత్ కౌర్ నివాసానికి ప్రకాశ్ రామ్ అనే ఒక వ్యక్తి వచ్చి ఢిల్లీ నుంచి వచ్చిన పత్రాలు ఉన్నాయంటూ ఒక ప్యాకెట్ ఇచ్చారు.
అయితే అందులో రూ.15 లక్షల విలువైన కరెన్సీ కట్టలు బయటపడటంతో ప్రకాశ్రామ్ను పోలీసులకు అప్పగించారు. జస్టిస్ నిర్మల్ యాదవ్ నివాసానికి బదులు నిర్మల్జిత్ కౌర్‌కు ఆ డబ్బును హర్యానా మాజీ అడ్వకేట్ జనరల్ సంజీవ్ బన్సల్ తన ప్యూన్ ద్వారా ఇచ్చినట్టు సాక్షులు తెలిపారు. దీంతో జస్టిస్ నిర్మల్ యాదవ్ పదవీ విరమణ రోజు సీబీఐ చార్జిషీట్ దాఖలు చేసింది.