అహ్మదాబాద్: గుజరాత్ మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ నాయకుడు జే నారాయణ్ వ్యాస్ ఆ పార్టీని వీడారు. పార్టీ తీరుపై విసుగుచెందిన తాను బీజేపీకి రాజీనామా చేసినట్లు శనివారం చెప్పారు. కాంగ్రెస్ పార్టీ లేదా ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)లో చేరవచ్చని సంకేతం ఇచ్చారు. ‘నేను బీజేపీతో విసిగిపోయాను. అందుకే పార్టీకి రాజీనామా చేశాను. ఇతర పార్టీలో చేరే ఆప్షన్లు తెరిచే ఉన్నాయి. రాబోయే గుజరాత్ ఎన్నికల్లో సిద్ధపూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తా’ అని మాజీ ఆరోగ్య మంత్రి అయిన నారాయణ్ వ్యాస్ తెలిపారు. వ్యక్తిగత కారణాలతో బీజేపీని వీడుతున్నట్లు తన రాజీనామా లేఖలో ఆయన పేర్కొన్నారు.
కాగా, నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన నారాయణ్ వ్యాస్ తమ పార్టీని సంప్రదించారని, సీనియర్ నేతలతో ఆయన చర్చలు జరుపుతున్నారని కాంగ్రెస్ నేత ఒకరు తెలిపారు. సిద్ధపూర్ నియోజకవర్గం నుంచి పోటీ కోసం టికెట్ అడుగుతున్నారని చెప్పారు. ఆ స్థానంలో ఆయనకు ఇంకా ప్రజాదరణ ఉన్నట్లు పలు సర్వేలు పేర్కొన్నాయని అన్నారు. మరోవైపు వ్యాస్‌తో తాము కూడా చర్చలు జరుపుతున్నామని, తమ పార్టీలో ఆయన చేరవచ్చని ఆప్ నేత వెల్లడించారు.
2007లో కాంగ్రెస్ నేత బల్వంత్‌సిన్హ్ రాజ్‌పుత్‌పై గెలిచిన నారాయణ్ వ్యాస్ గుజరాత్ శాసనసభకు తొలిసారి ఎన్నికయ్యారు. నాటి ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలోని ప్రభుత్వంలో ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్నారు. ఇప్పటి వరకు ఏడు సార్లు సిద్ధపూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఆయన నాలుగు సార్లు గెలిచారు. 2017లో కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యే చందాజీ ఠాకూర్ చేతిలో ఓడిపోయారు.