న్యూఢిల్లీ: హర్యానాలో కాంగ్రెస్ పార్టీకి మరో షాక్ తగిలింది. సీనియర్ నాయకుడు అశోక్ తన్వర్ ఆ పార్టీకి గుడ్‌బై చెప్పి తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో చేరాడు. తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు, పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా సమక్షంలో ఆయన టీఎంసీ తీర్థం పుచ్చుకున్నారు. న్యూఢిల్లీలో మమతాబెనర్జి స్వయంగా టీఎంసీ కండువా కప్పి అశోక్ తన్వర్‌ను పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా మమతాబెనర్జి మాట్లాడుతూ తాను త్వరలోనే హర్యానాకు వెళ్తానని చెప్పారు. అశోక్ తన్వర్ ఆహ్వానం మేరకు తాను అక్కడికి వెళ్తున్నట్లు తెలిపారు. అదేవిధంగా అంతటా బీజేపీని ఓడించడమే మా పార్టీ ప్రథమ ప్రాధాన్యమని మమత వ్యాఖ్యానించారు. జై హిందుస్థాన్, జై హర్యానా, జై బంగ్లా, జై గోవా, రామ్ రామ్ అంటూ తన ప్రసంగాన్ని ముగించారు.