Digvijay Singh | వాతావరణంలో మార్పులతో దేశవ్యాప్తంగా వ్యాధులు విజృంభిస్తున్నాయి. ఇప్పటికే దేశవ్యాప్తంగా డెంగ్యూ, మలేరియా కేసులు భారీగా నమోదవుతున్నాయి. అలాగే, పెద్ద ఎత్తున జనం వైరల్ ఫీవర్స్‌తో బాధపడుతున్నారు. కరోనా కేసులు సైతం నమోదవుతున్నాయి. ఈ క్రమంలోనే మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, రాజ్యసభ సభ్యుడు దిగ్విజయ్ సింగ్‌కు కరోనా పాజిటివ్‌గా తేలింది. తేలికపాటి లక్షణాలు కనిపించడంతో ఆయన కొవిడ్ టెస్ట్ చేయించుకోగా.. పాజిటివ్‌గా తేలింది. ఈ విషయాన్ని ఆయన సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.
తనకు కొవిడ్ టెస్ట్ పాజిటివ్‌గా వచ్చిందని.. ఐదురోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారని తెలిపారు. ఈ క్రమంలో కొంతకాలం ఎవరికీ కలువలేనని.. క్షమించాలని కోరారు. ఇదిలా ఉండగా.. దిగ్విజయ్ సింగ్ సోమవారం సాగర్ జిల్లా ఖురాయ్‌లోని బరోడియా నోనాగిర్ గ్రామంలో రాఖీ వేడుకల్లో పాల్గొన్నారు. నితిన్ అహిర్వార్ అనే వ్యక్తి హత్యకు గురయ్యాడు. అయితే, దిగ్విజయ్ సింగ్ గతేడాది వెళ్లి మృతుడి తల్లి, సోదరిని పరామర్శించి.. రాఖీ కట్టుకునేందుకు వస్తానని హామీ ఇచ్చారు. ఇందులో భాగంగా ఆయన రాఖీ కట్టించుకునేందుకు వెళ్లారు. తాజాగా ఆయనకు కరోనా పాజిటివ్‌గా తేలింది. కుటుంబానికి సైతం కొవిడ్ టెస్టులు చేయాలని కోరారు.