న్యూఢిల్లీ, జూలై 7: ఎలక్టోరల్ బాండ్ల ద్వారా రాజకీయ పార్టీలు అందుకున్న నిధులను జప్తు చేయాలని కోరుతూ ఖేమ్ సింగ్ భాటి అనే వ్యక్తి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఎన్నికల బాండ్ల పథకాన్ని రాజ్యాంగవిరుద్ధంగా పేర్కొంటూ ఫిబ్రవరి 15న సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందని, బాండ్ల జారీని వెంటనే నిలిపివేయాలని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ)ను ఆదేశించిందని, ఇప్పటివరకు రాజకీయ పార్టీలు అందుకున్న నిధులను జప్తు చేయాలన్నారు.
రాజకీయ పార్టీలు.. వివిధ కార్పొరేట్ సంస్థలకు లబ్ధి కలిగించి, అందుకు ప్రతిఫలంగా ఈ నిధులను అందుకున్నాయని ఆయన ఆరోపించారు. సంస్థలకు అందిన అక్రమ ప్రయోజనాలపై రిటైర్డ్ జడ్జీతో కమిటీ వేసి విచారణ జరిపించాలని కోరారు.