తిరువనంతపురం: తన కుమారుడితో టాయిలెట్ సీటును బలవంతంగా నాకించారని, తల లోపల ఉంచి ఫ్లష్ చేశారని విద్యార్థి తల్లి ఆరోపించింది. (Forced to lick toilet seat) స్కూల్లో నిరంతరం ర్యాగింగ్, బెదిరింపులు అతడ్ని ఆత్మహత్యకు ప్రేరేపించాయని తెలిపింది. సీఎం కార్యాలయంతోపాటు, డీజీపీకి ఈ మేరకు లేఖ ద్వారా ఫిర్యాదు చేసింది. జనవరి 15న కేరళలోని ఎర్నాకుళంలో అపార్ట్మెంట్ బిల్డింగ్ 26వ అంతస్తు నుంచి కిందకు దూకి 15 ఏళ్ల మిహిర్ ఆత్మహత్య చేసుకున్నాడు. కుమారుడి మరణంపై కలత చెందిన తల్లిదండ్రులు అతడి సూసైడ్‌కు దారి తీసిన కారణాల సమాచారాన్ని సేకరించారు. మిహిర్ స్నేహితులు, స్కూల్లోని విద్యార్థులను కలిశారు. అలాగే సోషల్ మీడియా పోస్ట్‌లు, మెసేజ్‌లను పరిశీలించారు. స్కూల్లో విద్యార్థుల ర్యాగింగ్, హింసను తట్టుకోలేక కుమారుడు ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుసుకుని షాక్ అయ్యారు.
కాగా, మిహిర్ తల్లి రజ్నా ఈ దారుణ విషయాలను లేఖ ద్వారా మీడియాకు వెల్లడించింది. స్టూడెంట్స్ గ్యాంగ్ స్కూల్లో, బస్సులో తన కుమారుడ్ని తిట్టడంతోపాటు కొట్టి హింసించినట్లు ఆమె ఆరోపించింది. చివరి రోజున కూడా ఊహించలేని అవమానాన్ని అతడు భరించాడని తెలిపింది. ‘బలవంతంగా వాష్‌రూమ్‌కు తీసుకెళ్లారు. టాయిలెట్ సీటును నాకమని బలవంతం చేశారు. టాయిలెట్‌ను ఫ్లష్ చేసి తల లోపల ఉంచారు. ఈ క్రూరమైన చర్యలు అతడిని తట్టుకోలేనిగా చేశాయి. స్కూల్ నుంచి ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత నా కుమారుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు’ అని అందులో పేర్కొంది.
మరోవైపు తన కుమారుడి చర్మం రంగు వల్ల కూడా అతడ్ని లక్ష్యంగా చేసుకున్నారని రజ్నా ఆవేదన వ్యక్తం చేసింది. నిరంతరం ఎగతాళి చేసి హింసించి ఆత్మహత్యకు పురిగొల్పిన విద్యార్థులు చివరకు అతడి మరణాన్ని కూడా సెలబ్రేట్ చేసుకున్నారని ఆమె ఆరోపించింది. దీనికి సంబంధించిన వాట్సాప్ మెసేజ్‌ల స్క్రీన్ షాట్లను షేర్ చేసింది. ఈ ఆధారాలతో తక్షణం, నిష్పాక్షిక దర్యాప్తు జరుపాలని ఆమె కోరింది. సీఎం కార్యాలయంతోపాటు డీజీపీకి ఈ మేరకు ఫిర్యాదు లేఖను మిహిర్ తల్లిదండ్రులు అందజేశారు.