లక్నో: ఒక కుమారుడు తన తల్లిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. సోదరుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు ఆ వ్యక్తిని అరెస్ట్ చేశారు. ఈ కేసుపై విచారణ జరిపిన కోర్టు నిందితుడికి జీవితకాల జైలు శిక్ష విధించింది. (Man Rapes Mother, Gets Life Term) ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షహర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. గత ఏడాది జనవరి 16న 38 ఏళ్ల వ్యక్తి పశువులకు మేత కోసమని 60 ఏళ్ల తల్లిని పొలాల వద్దకు తీసుకెళ్లాడు. అక్కడ ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. తల్లినని, వృద్ధురాలినని ఆమె మొరపెట్టుకున్నప్పటికీ వదిలిపెట్టలేదు. ఈ విషయం ఎవరికైనా చెబితే చంపుతానని బెదిరించాడు. అలాగే ఇంట్లో ప్రతి రాత్రి తనతో కలిసి పడుకోవాలని డిమాండ్ చేశాడు. పదేళ్ల కిందట ఆమె భర్త మరణించాడు.
కాగా, స్పృహలోకి వచ్చిన ఆ మహిళ ఇంటికి వచ్చిన తర్వాత ఈ దారుణం గురించి మరో కుమారుడు, మేనల్లుడికి చెప్పింది. దీంతో ఆమె మరో కుమారుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ నేపథ్యంలో నిందితుడైన ఆ వ్యక్తిని అరెస్ట్ చేశారు. ఈ కేసుపై ఏడాదిన్నర పాటు ఫాస్ట్ ట్రాక్ కోర్టులో విచారణ కొనసాగింది. తాను ఈ నేరం చేయలేదని, ఆస్తి వివాదం వల్ల తనపై తప్పుడు కేసు పెట్టినట్లు ఆ మహిళ కుమారుడు ఆరోపించాడు. అలాగే అతడి తల్లిపై లైంగిక దాడి జరిగినట్లుగా డాక్టర్ అనుమానం వ్యక్తం చేయలేదని నిందితుడి తరఫు న్యాయవాది కోర్టులో వాదించారు.
మరోవైపు నిందితుడు, అతడి తల్లికి మధ్య ఆస్తి వివాదాన్ని రుజువు చేయడానికి డిఫెన్స్ లాయర్ ఎలాంటి సాక్షాలను ప్రవేశపెట్టలేదని కోర్టు తెలిపింది. ‘ఆస్తి కోసం తనపై అత్యాచారం చేశాడని ఏ తల్లి కూడా తన కొడుకుపై ఆరోపించదన్నది గమనించాలి’ అని పేర్కొంది. అలాగే అత్యాచార బాధితురాలి వాంగ్మూలాన్ని సాధారణంగా ఆమోదించవచ్చన్న సుప్రీంకోర్టు గత తీర్పును కూడా కోర్టు పరిగణలోకి తీసుకున్నది. దోషికి జీవిత ఖైదు, రూ.51,000 జరిమానా విధించింది. నేరపూరిత బెదిరింపులకు పాల్పడినందుకు ఏడాది జైలు శిక్ష, వెయ్యి జరిమానా విధిస్తూ తీర్పు ఇచ్చింది. ఈ రెండు జైలు శిక్షలు ఏకకాలంలో అమలు చేయాలని కోర్టు ఉత్తర్వులో పేర్కొంది.