చెన్నై: వేతనాలు పెంచాలని, మెరుగైన పని పరిస్థితులు కల్పించాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. గత వారం రోజులుగా సమ్మె చేస్తున్న కార్మికులు నిరసన ప్రదర్శనకు ప్లాన్ చేశారు. ఈ నేపథ్యంలో వంద మందికిపైగా కార్మికులను పోలీసులు అదుపులోకి తీసుకుని నిర్బంధించారు. (workers detained) తమిళనాడులోని చెన్నైలో ఈ సంఘటన జరిగింది. చెన్నై శివారు కాంచీపురంలోని శాంసంగ్ ఎలక్ట్రానిక్స్ ఫ్యాక్టరీకి చెందిన కార్మికులు గత వారం రోజులుగా సమ్మె చేస్తున్నారు. వేతనాలు పెంచాలని, మెరుగైన పని పరిస్థితులు కల్పించాలని, సెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్స్ (సిఐటీయూ)ను కార్మిక సంఘంగా గుర్తించాలని డిమాండ్ చేస్తున్నారు.
కాగా, ఈ ఫ్యాక్టరీలో పనిచేస్తున్న 1,800 మంది కార్మికుల్లో వెయ్యి మంది సమీపంలోని తాత్కాలిక టెంట్లలో కొన్ని రోజులుగా నిరసన చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అన్ని సమస్యలను త్వరగా పరిష్కరించేందుకు కార్మికులతో చర్చలు ప్రారంభించినట్లు శాంసంగ్ శుక్రవారం తెలిపింది. అయితే ఆ సంస్థతోపాటు రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో జరిపిన చర్చలు విఫలమయ్యాయి. దీంతో సోమవారం నిరసన ప్రదర్శన నిర్వహించాలని కార్మికులు నిర్ణయించారు.
మరోవైపు ఈ ప్రాంతంలో స్కూల్స్, కాలేజీలు, హాస్పిటల్స్ ఉన్నందున కార్మికుల నిరసన ర్యాలీకి పోలీసులు అనుమతి నిరాకరించారు. అయినప్పటికీ కార్మికులు సోమవారం నిరసనకు ప్లాన్ చేసినట్లు ఆరోపించారు. ఈ నేపథ్యంలో సుమారు 104 మంది కార్మికులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాంచీపురం సమీపంలోని ఒక కళ్యాణ మండపంలో వారిని నిర్బంధించారు.
కాగా, సమ్మె చేస్తున్న ఈ కార్మికులకు మద్దతుగా తమిళనాడులోని అధికార డీఎంకే అనుబంధ కార్మిక సంఘంతో సహా 12 యూనియన్ గ్రూపులు బుధవారం చెన్నైలో నిరసన చేపట్టాలని నిర్ణయించాయి. అయితే దీనిపై శాంసంగ్ సంస్థ స్పందించలేదని రాయిటర్స్ వార్తా సంస్థ పేర్కొంది.