కోల్కతా: తృణమూల్ కాంగ్రెస్ కౌన్సిలర్(TMC councillor) ఓ మహిళను వేధించాడు. దీంతో అతన్ని కోల్కతా పోలీసులు అరెస్టు చేశారు. 114వ వార్డుకు చెందిన కౌన్సిలర్ బిశ్వజిత్ మోండల్ అనే టీఎంసీ పార్టీకి చెందిన నేత స్థానికంగా ఓ మహిళను వేధించినట్లు తెలిసింది. వేధింపులకు గురైన ఆ మహిళ రీజెంట్ పార్క్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు ఇచ్చింది. జూన్ ఒకటో తేదీన పుర్బా ఏరియాకు చెందిన ఆమె ఫిర్యాదు చేసింది. 2024 మార్చిలో ఓ స్కూల్ వద్ద కౌన్సిలర్ మోండల్ తనపై దాడి చేసి వేధించినట్లు ఆ మహిళ తన ఫిర్యాదులో వెల్లడించింది.
దాడి, వేధింపులు, బెదిరింపుల కింద అతనిపై కేసు బుక్ చేశారు. ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతున్నట్లు పోలీసులు చెప్పారు. ఇటీవల పశ్చిమ బెంగాల్లో ప్రభుత్వం మారిన తర్వాత.. కౌన్సిలర్ మోండల్ తనతో దుర్భాషలాడారని, తీవ్రంగా బెదిరించినట్లు ఆమె ఆరోపించింది. కోల్కతా మున్సిపాల్టీకి చెందిన కౌన్సిలర్లను ఇటీవల కొందర్ని అరెస్టు చేశారు.
అవినీతికి అలవాటై బెదిరింపులకు పాల్పడుతున్న వారిని అదుపులోకి తీసుకున్నారు. 106వ వార్డుకు చెందిన ఆర్జిత్ దాస్, 36వ వార్డుకు చెందిన సచిన్ సింగ్ను వివిధ బెదిరింపు కేసుల్లో అరెస్టు చేశారు. రెండో వార్డుకు చెందిన మహేశ్ కుమార్ శర్మను కూడా అదుపులోకి తీసుకున్నారు. బెదిరింపు కేసులో 123వ వార్డుకు చెందిన టీఎంసీ కౌన్సిలర్ సుదీప్ పొల్లేని కూడా అరెస్టు చేశారు.