న్యూఢిల్లీ, జూన్ 19: క్యారీబ్యాగ్కు రూ.10 తీసుకున్నందుకు ప్రముఖ ఫుట్వేర్ బ్రాండ్ రెడ్టేప్కు రూ.8వేల జరిమానా విధించింది వినియోగదారుల కోర్టు. హర్యానాలోని రోహ్తక్ ప్రాంతంలో ఉన్న రెడ్టేప్ స్టోర్లో ఓ వినియోగదారుడు 2023 ఏప్రిల్ 11న రూ.2,069 విలువైన షూస్ కొన్నాడు. క్యారీబ్యాగ్ కోసం అదనంగా రూ.10 చెల్లించాలని చెప్పడంతో వినియోగదారుడు ఫ్రీగా ఇవ్వాలని, డబ్బులు తీసుకోవడం నేరం అని వాదనకు దిగాడు. అది తమ కంపెనీ పాలసీ అని ఉద్యోగులు చెప్పడంతో వినియోగదారుడు ఆ డబ్బు చెల్లించి, తర్వాత వినియోగదారుల ఫోరంను ఆశ్రయించాడు. తన రూ.10 తిరిగి ఇవ్వడంతో పాటు రూ.50 వేలు పరిహారం కింద, 22 వేలు న్యాయపోరాట ఖర్చుల కింద ఇవ్వాలని కోరాడు.
రెడ్ టేప్ మాత్రం క్యారీబ్యాగ్లకు డబ్బులు తీసుకోవడం పర్యావరణాన్ని కాపాడటంలో భాగమని.. ఉచిత బ్యాగుల దుర్వినియోగాన్ని ఆపేందుకే ఇలా చేస్తున్నామని తెలిపింది. ఇరువురి వాదనలు విన్న బెంచ్.. క్యారీబ్యాగ్లకు డబ్బులు తీసుకోవడం చట్టరీత్యా నేరం అని స్పష్టం చేసింది. ఇందుకు గాను వినియోగదారుడికి రూ.10 తిరిగి చెల్లించడంతో పాటు రూ.4 వేలు పరిహారం, రూ.4 వేలు న్యాయపోరాట ఖర్చులు ఇవ్వాలని ఆదేశించింది. నెల రోజుల్లోపు పూర్తి డబ్బులు చెల్లించాలని.. అప్పటి దాకా వారానికి రూ.50 అదనంగా ఇవ్వాలని కోర్టు తెలిపింది. దీంతో ప్రతి స్టోర్లోనూ ఇలాగే క్యారీబ్యాగ్ల పేరుతో డబ్బులు వసూలు చేస్తున్నారని పలువురు నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. ఆ స్టోర్లు డబ్బులు తీసుకోకుండా ఆదేశాలు ఇవ్వాలని కోరుతున్నారు.