న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కొత్త లేబర్ కోడ్ల వల్ల ఫుడ్ డెలివరీ మరింత ఖరీదు కానుంది. గిగ్ వర్కర్ల కోసం కేంద్ర సంక్షేమ నిధికి డిజిటల్ ప్లాట్‌ఫామ్స్ తమ వార్షిక టర్నోవర్‌లో 1-2 శాతం మేరకు చెల్లించవలసి ఉంటుంది. దీంతో పర్-ఆర్డర్ ఖర్చులు రూ.2-3 వరకు పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. జేఎం ఫైనాన్షియల్ తెలిపిన వివరాల ప్రకారం, ఫుడ్ డెలివరీ, క్విక్ కామర్స్ క్యాటగిరీల్లోని కంపెనీలకు ప్రతి ఆర్డర్‌కు దాదాపు రూ.2.10 నుంచి రూ.2.50 వరకు అదనంగా భారం పడుతుంది.
2025-26 ఆర్థిక సంవత్సరంలో అంచనా ఆర్డర్ వాల్యూమ్స్‌కు దీనిని వర్తింపజేస్తే, ఎటర్నల్ (జొమాటో)కు దాదాపు రూ.430 కోట్లు, స్విగ్గీకి రూ.260 కోట్లు భారం పడుతుంది. ఈ భారాన్ని ఈ కంపెనీలు వినియోగదారులపైనే మోపుతాయి. ఇప్పటికే వినియోగదారులు ప్లాట్‌ఫాం ఫీజు, చిన్న ఆర్డర్ పెనాల్టీలు, పీక్ అవర్ సర్జెస్, సవరించిన జీఎస్టీ లెవీస్ వంటి భారాలను మోస్తున్నారు. ఇవి చాలవన్నట్లు ఇకపై ప్రతి ఆర్డర్‌కు రూ.2-3 మేరకు అదనంగా చెల్లించవలసి ఉంటుంది. ఈ విధంగా భారాలు పడటం రెండేళ్లలో ఇది నాలుగోసారి అవుతుంది.
ఎలారా సెక్యూరిటీస్ నిపుణుడు కరణ్ టౌరానీ మాట్లాడుతూ, గిగ్ వర్కర్స్ పేఅవుట్స్పై కాంట్రిబ్యూషన్స్ 5 శాతానికి చేరితే, రైడర్ వ్యయాలు చెప్పుకోదగ్గ స్థాయిలో పెరుగుతాయన్నారు. ఎటర్నల్ (జొమాటో) డెలివరీ వ్యయం జీఎంవీలో 9.8 శాతం నుంచి 10.3 శాతానికి పెరుగుతుందన్నారు. స్విగ్గీ డెలివరీ వ్యయం 11.6 శాతం నుంచి 12 శాతానికిపైగా పెరుగుతుందని చెప్పారు. ఇప్పటికే నష్టాలతో సతమతమవుతున్న కంపెనీలకు స్వల్ప జీఎంవీ పెరుగుదల అయినా, ప్రభావం తీవ్రంగా ఉంటుందని తెలిపారు. ఆర్డర్ వాల్యూస్ పెరిగినప్పటికీ, ధర పట్ల జాగ్రత్త వహించే కస్టమర్లు తక్కువ విలువ గల ఆర్డర్లను ఇవ్వడం మానుకోవచ్చునని నిపుణులు చెప్తున్నారు.
2025-26 ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో స్విగ్గీ రెవెన్యూ 54.4 శాతం పెరిగి రూ.5,561 కోట్లకు చేరింది, కానీ దాని నికర నష్టం రూ.1,092 కోట్లుగా నమోదైంది. ఎటర్నల్‌కు వచ్చిన రెవెన్యూ రూ.13,590 కోట్లు (183 శాతం పెరుగుదల), కాగా నికర లాభం రూ.65 కోట్లకు తగ్గింది. సాంఘిక భద్రత స్మృతి వల్ల గిగ్ వర్కర్లకు బీమా, ఆరోగ్య సంరక్షణ, పదవీ విరమణ ప్రయోజనాలు లభిస్తాయి. అయితే దీనికి సంబంధించిన ఆర్థిక భారాన్ని అంతిమంగా వినియోగదారులే భరించవలసి ఉంటుందని నిపుణులు చెప్తున్నారు.