న్యూఢిల్లీ: ప్లంబర్, ఎలక్ట్రీషియన్, ల్యాబ్ టెక్నీషియన్ వంటి చేతులతో పని చేసే ఉద్యోగాలు చేసే వారికి కృత్రిమ మేధ (ఏఐ) వల్ల ముప్పు లేదని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురాం రాజన్ చెప్పారు. ఆంత్రప్రెన్యూర్ కుశల్ లోధాకు ఇచ్చిన పాడ్‌కాస్ట్ ఇంటర్వ్యూలో రఘురాం రాజన్ మాట్లాడుతూ, ఏఐ నడిపే భవిష్యత్తులోకి భారత దేశం దయనీయంగా, అతి తక్కువగా శిక్షణ పొందిన ఉద్యోగ బృందంతో వెళ్తున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. ఉద్యోగ బృందాన్ని సిద్ధం చేయడంలో అత్యవసరంగా సంస్కరణలు జరగాలని పిలుపునిచ్చారు. కేవలం విద్యా సంబంధిత డిగ్రీలపై కాకుండా, ఆచరణాత్మక (ప్రాక్టికల్) నైపుణ్యాలపై స్పష్టమైన దృష్టితో యువతను సిద్ధం చేయాలన్నారు.
దీనిపై జాతీయ స్థాయిలో పునరాలోచన జరగాలని కోరారు. చేతులతో పని చేయవలసిన అవసరం ఉన్న ఉద్యోగాలు ఉదాహరణకు, ప్లంబర్ ఉద్యోగం, ఏఐ యుగంలో పోయే అవకాశం లేదని వివరించారు. ఆటోమేషన్‌ను ఎదిరించి నిలిచే ఉద్యోగాలు ప్లంబింగ్, విమానాల ఇంజిన్ మరమ్మతు వంటివని పేర్కొన్నారు. ఈ ముఖ్యమైన ఉద్యోగాల కోసం అయినా అర్హత పొందడానికి తగిన విధంగా గణితం, సైన్స్, కమ్యూనికేషన్లలో ప్రాథమిక నైపుణ్యాలతో విద్యార్థులను ప్రస్తుత భారతదేశ విద్యా వ్యవస్థ సిద్ధం చేయలేకపోతున్నదని చెప్పారు. అప్రెంటిస్‌షిప్స్, నైపుణ్యం గల వృత్తులకు గౌరవం పెరగాలని, థియరీతో అప్లయ్డ్ లెర్నింగ్‌ను సమతుల్యం చేసే పాఠ్య ప్రణాళిక ఉండాలని అన్నారు.