Sugar Mill | హర్యానా (Haryana)లో గత రాత్రి భారీ వర్షం కురిసింది. ఈ వర్షానికి ఆసియాలోనే అతిపెద్ద షుగర్ మిల్లోకి వరద పోటెత్తింది. దీంతో దాదాపు రూ.50 కోట్ల విలువైన పంచదార కరిగిపోయింది.
హర్యానాలోని యమునానగర్ (Yamunagar)లో గల సరస్వతి చక్కెర కర్మాగారానికి (Saraswati sugar mill) ఆసియాలోనే అతిపెద్ద షుగర్ మిల్ (Asias Largest Sugar Mill)గా పేరుంది. అయితే, గత రాత్రి కురిసిన భారీ వర్షానికి మిల్లోకి భారీగా వర్షపు నీరు చేరింది. దీంతో అందులో స్టోర్ చేసిన పంచదార నీటిపాలైంది. రూ.90 కోట్ల విలువైన 2,20,000 క్వింటాళ్ల చక్కెర నిల్వ చేయగా.. అందులో 40 శాతంమేర కరిగిపోయినట్లు మిల్ అధికారులు తెలిపారు. దాదాపు రూ.50 నుంచి రూ.60 కోట్ల విలువైన చక్కెర కరిగిపోయిందని తెలిపారు.
సరస్వతి చక్కెర కర్మాగారం జనరల్ మేనేజర్ రాజీవ్ మిశ్రా మాట్లాడుతూ.. ‘నిన్న రాత్రి భారీ వర్షం కురిసింది. అర్ధరాత్రి సమయంలో మిల్ ఆవరణలోకి వరద ప్రవేశిస్తోందని సిబ్బంది మమ్మల్ని హెచ్చరించారు. మున్సిపల్ కార్పొరేషన్ డ్రెయిన్ మిల్లు వెనుక నుంచే వెళుతుంది. ఆక్రమణ కారణంగా డ్రెయిన్ మూసుకుపోయి.. వరద నీరంతా మిల్లులోకి చేరింది. చక్కెర అధిక తేమను గ్రహించే స్వభాగం కలిగి ఉండటం వల్ల తీవ్రంగా నష్టం వాటిల్లింది. దాదాపు రూ.50 కోట్ల నుంచి రూ.60 కోట్ల విలువైన చక్కెర కరిగిపోయింది. అయితే, నష్టాన్ని ఇప్పుడే అంచనా వేయలేం. మిల్లు మొత్తం తనిఖీ చేసిన తర్వాత నష్టంపై ఓ అంచనాకు రావొచ్చు. ఇంతకు ముందు ఎప్పుడూ ఇలాంటి పరిస్థితి ఎదుర్కోలేదు’ అని తెలిపారు.
Also Read..
Beas River | హిమాచల్ ప్రదేశ్లో భారీ వర్షాలు.. ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్న బియాస్ నది.. VIDEOS