న్యూఢిల్లీ: యుద్ధంతో అట్టుడుకున్న ఇరాన్ నుంచి తుర్క్మెనిస్థాన్, అర్మేనియాకు తరలించిన 110 మంది భారతీయ విద్యార్థులు సురక్షితంగా గురువారం స్వదేశానికి చేరుకున్నారు. ఆపరేషన్ సింధులో భాగంగా వీరిని తుర్క్మెనిస్థాన్, అర్మేనియా ప్రభుత్వాల సాయంతో న్యూఢిల్లీకి విమానంలో తీసుకొచ్చినట్టు విదేశాంగ సహాయ మంత్రి కీర్తి వర్ధన్ సింగ్ తెలిపారు.
మరింత మంది భారత విద్యార్థులను ఇరాన్ నుంచి ఖాళీ చేయించి స్వదేశానికి తీసుకురావడానికి తగిన చర్యలు తీసుకొంటున్నట్టు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా పలువురు విద్యార్థులు భారత్, తుర్క్మెనిస్థాన్, అర్మేనియా ప్రభుత్వాలకు కృతజ్ఞతలు తెలిపారు. యుద్ధం సందర్భంగా ఇరాన్లో నెలకొన్న భయానక పరిస్థితులను పంచుకున్నారు. వచ్చినవారిలో కశ్మీర్ విద్యార్థులు ఎక్కువగా ఉన్నారు.