ముంబై: మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ ప్రయాణిస్తున్న విమానం ఇవాళ కూలిన విషయం తెలిసిందే. ఆ ప్రమాదంలో ఫ్లయిట్ అటెండెంట్ పింకీ మాలి(Pinky Mali) కూడా ప్రాణాలు కోల్పోయారు. విమానంలో ప్రయాణించడానికి ముందు ఆమె చివరి సారి తన తండ్రికి ఫోన్ చేసింది. ముంబైలోని వర్లీలో నివసిస్తున్న ఆమె తన తండ్రికి ఫోన్ చేసి అజిత్ పవార్‌తో కలిసి ప్రయాణించనున్నట్లు చెప్పింది. నాన్నా.. పవార్‌తో కలిసి బారామతికి వెళ్తున్నా.. ఆయన్ను డ్రాప్ చేసిన తర్వాత.. నేను నాందేడ్‌కు వస్తాను, రేపు మాట్లాడుకుందాం అంటూ తన కుమార్తె తనకు ఫోన్ చేసినట్లు తండ్రి శివకుమార్ మాలి పేర్కొన్నాడు. రేపు మాట్లాడుకుందాం అని తన కుమార్తె చెప్పిన మాటలు ఎప్పటికీ నిజం కావు అని, ఆ రోజు రాదు అని శివకుమార్ తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు.
తన కూతురు గతంలోనూ అనేక సందర్భాల్లో అజిత్ పవార్‌తో కలిసి విమాన ప్రయాణం చేసినట్లు ఆయన గుర్తు చేశారు. తన కూతుర్ని కోల్పోయానని, నిజానికి ఏం జరిగిందో తెలియదని, అలాంటి ప్రమాదాల గురించి తనకు పరిజ్ఞానం లేదని, ఆ ఘటన తీవ్రంగా కలిచివేసిందని, నాకు కేవలం కూతురి బాడీని అప్పగిస్తే .. ఆమెకు అంతిమ సంస్కారాలు నిర్వహించుకుంటానని, ఇదే నేను కోరుకుంటానని ఆయన అన్నారు.
బారామతి విమానాశ్రయం వద్ద కూలిన విమానంలో అయిదుగురు దుర్మరణం చెందారు. డిప్యూటీ సీఎం అజిత్ పవార్‌తో పాటు ఆయన పర్సనల్ సెక్యూర్టీ ఆఫీసర్ విదిప్ జాదవ్, ఫ్లయిట్ అటెండెంట్ పింకీ మాలీ, పైలట్ ఇన్ కమాండ్ సుమిత్ కపూర్, సెకండ్ ఇన్ కమాండ్ శాంభవి పాటక్ ఉన్నారు.