చండీగఢ్: శిరోమణి అకాలీదళ్ మూల పురుషుడు, ఐదు పర్యాయాలు పంజాబ్ ముఖ్యమంత్రిగా పనిచేసిన రాజకీయ ఉద్ధండుడు ప్రకాశ్ సింగ్ బాదల్ (Parkash Singh Badal) ఇవాళ అస్వస్థతకు గురయ్యారు. దాంతో కుటుంబసభ్యులు ఆయనను మొహాలీలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బంది ఏర్పడటంతో ఆయనను ఆస్పత్రిలో చేర్చినట్టు కుటుంబసభ్యులు తెలిపారు. ప్రస్తుతం ప్రకాశ్ సింగ్ బాదల్ వయస్సు 95 సంవత్సరాలు.
విషయం తెలుసుకున్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా ప్రకాశ్ సింగ్ బాదల్ కుమారుడు సుఖ్బీర్ సింగ్ బాదల్‌కు ఫోన్ చేసి ఆయన తండ్రి ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ విషయాన్ని అమిత్ షా ట్విటర్ ద్వారా వెల్లడించారు. “ప్రకాశ్ సింగ్ బాదల్ అనారోగ్యానికి గురయ్యారన్న వార్త నాకు చాలా బాధ కలిగిస్తోంది. ప్రకాశ్ సింగ్ గారి ఆరోగ్య పరిస్థితి గురించి నేను సుఖ్బీర్ సింగ్ బాదల్‌కు ఫోన్ చేసి తెలుసుకున్నా” అని షా ట్వీట్ చేశారు.